Share News

Formula E Race: ఇదేం ఫార్ములా?

ABN , Publish Date - Jan 03 , 2025 | 03:40 AM

మీకు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది! అందులో ఎగ్జిబిషన్‌ పెట్టుకుంటానని ఓ వ్యక్తి వచ్చాడు! భూమిని చదును చేసి ఇవ్వాలని షరతు పెట్టాడు! మీ ఇద్దరి మధ్య మరో వ్యక్తి వచ్చాడు! ఎగ్జిబిషన్‌కు అయ్యే ఖర్చు తాను భరిస్తానని, లాభనష్టాలకు తనదే బాధ్యతని చెప్పాడు.

Formula E Race: ఇదేం ఫార్ములా?

  • సంబంధం లేకుండా ఒప్పందం.. నిబంధనలు పాటించకుండా చెల్లింపులు

  • ఫార్ములా ఈ కార్‌ రేసు నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం

  • ప్రభుత్వ బాధ్యత కేవలం సివిల్‌ పనుల నిర్వహణే

  • ఎఫ్‌ఈవోకు చెల్లింపులు చేయాల్సింది స్పాన్సరర్‌

  • నష్టాలు వస్తున్నాయంటూ పక్కకి తప్పుకొన్న ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌

  • సంబంధం లేకపోయినా.. ఆ బాధ్యత నెత్తికెత్తుకున్న సర్కారు

  • సంబంధమే లేని హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి 46 కోట్లు

  • ఆర్థిక శాఖ, క్యాబినెట్‌ ముద్ర లేకుండా డాలర్లలో చెల్లింపులు

  • ఆర్బీఐ అనుమతి తప్పనిసరి.. అది లేకుండానే నిధుల బదిలీ

  • త్రైపాక్షిక ఒప్పందానికి నాలుగు నెలల ముందే పుట్టిన కంపెనీ

  • గ్రీన్‌ కో డైరెక్టర్లు ప్రమోటర్లు.. పెయిడప్‌ క్యాపిటల్‌ 2 లక్షలే

  • క్రీడలు, ఫార్ములా ఈతో సంబంధం లేకుండానే ఆ బాధ్యతలు

  • అడుగడుగునా ఉల్లంఘనలు.. వాటిపైనే ఏసీబీ దృష్టి

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మీకు రెండు ఎకరాల ఖాళీ స్థలం ఉంది! అందులో ఎగ్జిబిషన్‌ పెట్టుకుంటానని ఓ వ్యక్తి వచ్చాడు! భూమిని చదును చేసి ఇవ్వాలని షరతు పెట్టాడు! మీ ఇద్దరి మధ్య మరో వ్యక్తి వచ్చాడు! ఎగ్జిబిషన్‌కు అయ్యే ఖర్చు తాను భరిస్తానని, లాభనష్టాలకు తనదే బాధ్యతని చెప్పాడు. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్‌ పెట్టుకున్న వ్యక్తికి నిర్దిష్ట మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు ముగ్గురూ ఒప్పందం చేసుకున్నారు. నాలుగు రోజులు గడిచింది! మధ్యలో వచ్చిన వ్యక్తి నష్టం వస్తోందంటూ వెళ్లిపోయాడు. భూమిని ఇవ్వడమే కాకుండా అప్పుడు ఆ వ్యక్తి చెల్లించాల్సిన డబ్బులను కూడా మీరే చెల్లిస్తారా!? మీ జేబులో డబ్బులు కాకుండా మీ దగ్గర ఉన్నాయని మీ ఇంటి పక్క వ్యక్తి డబ్బులు ఇచ్చేస్తారా!? ఎగ్జిబిషన్‌ ప్రచారానికి సంబంధించి ఏమాత్రం అనుభవం లేని వ్యక్తితో మీరు ఒప్పందం చేసుకుంటారా!? చేసుకోరు కదా.. కానీ, ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది అచ్చంగా ఇదే!! ఫార్ములా ఈ-కారు రేసును హైదరాబాద్‌లో నాలుగు విడత (9, 10, 11, 12 సెషన్లలో)ల్లో నిర్వహించడానికి పురపాలక శాఖ, ఫార్ములా ఈ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఈవో) ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం పురపాలక శాఖ పాత్ర చాలా పరిమితం. రేస్‌ ట్రాక్‌ నిర్మించడం, ఇతర సివిల్‌ పనులు మాత్రమే పురపాలక శాఖ బాధ్యత. ఈ-కారు రేస్‌ను నిర్వహించేది ఫార్ములా ఈ ఆర్గనైజేషన్‌. తాను ప్రమోటర్‌గా ఉంటానని, అందుకయ్యే వ్యయాన్ని ఎఫ్‌ఈవోకు చెల్లిస్తానని ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ అనే సంస్థ ముందుకు వచ్చింది. రేస్‌ వాణిజ్య వ్యవహారాలను తాను చూసుకుంటానని చెప్పింది. ఈ మేరకు మూడు పార్టీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అంతే తప్పితే.. ప్రమోటర్‌ తప్పుకుంటే ఆ బాధ్యత ప్రభుత్వానిదని, ఎఫ్‌ఈవోకు చెల్లించాల్సిన డబ్బులను ప్రభుత్వమే చెల్లించాలంటూ ఒప్పందంలో ఎక్కడా లేదు. అటువంటి నిబంధన కూడా లేదు. కానీ, రెండో విడత రేస్‌ నిర్వహణ సమయంలో స్పాన్సరర్‌ తప్పుకోవడంతో ప్రభుత్వమే స్పాన్సరర్‌ అవతారం ఎత్తింది. ఈ వ్యవహారంపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.


తనకు సంబంధం లేకపోయినా..

తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా స్పాన్స రర్‌ అవతారాన్ని ప్రభుత్వం ఎత్తడం ఏమిటనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా మొదటి రేస్‌ను 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ క్రమంలో రేస్‌ ట్రాక్‌, సివిల్‌ పనులకు పురపాలక శాఖ రూ.12 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. ఎఫ్‌ఈవోకు చెల్లింపులు, ఇతర నిర్వహణ ఖర్చులను ఎఫ్‌ఈవోకు చెల్లించడం స్పాన్సరర్‌ అయిన ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ బాధ్యత. కానీ, 2023 మేలో పదో సెషన్‌ నిర్వహించాల్సి ఉండగా.. నష్టాలు వస్తున్నాయంటూ ముందే ఆ కంపెనీ తప్పుకొంది. అప్పటికే 50 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంది. దానిని చెల్లించలేదు. ఆ తర్వాత ఈవెంట్‌కు ముందే మరో 50 శాతం చెల్లించాలి. ఇందులో స్పాన్సర్‌ కంపెనీ విఫలమైతే.. 4 శాతం వార్షిక వడ్డీతో ఎఫ్‌ఈవోకు నష్టపరిహారం చెల్లించాలి. అయినా, ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ తప్పుకొంది. తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఆ బాధ్యతను పురపాలక శాఖ నెత్తికి ఎత్తుకుంది. పదో సెషన్‌కు సంబంధించి రూ.46 కోట్లను ఎఫ్‌ఈవోకు చెల్లించింది. ఆ చెల్లింపులను కూడా పురపాలక శాఖ నుంచి చేయలేదు. హెచ్‌ఎండీఏ బాధ్యతలు కూడా తానే చూస్తుండడంతో అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆ నిధులను హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి చెల్లించారు. అంతేనా.. లండన్‌కు చెందిన ఎఫ్‌ఈవోకు డాలర్లలోనే చెల్లింపులు చేశారు. నిజానికి, డాలర్లలో చెల్లింపులు చేయాలంటే అందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఉండాలి. కానీ, దానిని తీసుకోలేదు. ఇక్కడ తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా స్పాన్సర్‌ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని.. స్పాన్సరర్‌ చెల్లించాల్సిన డబ్బులను ఎఫ్‌ఈవోకు ప్రభుత్వమే చెల్లించడంపై ఏసీబీ కూపీ లాగుతోంది.


ఏమాత్రం అనుభవం లేకుండానే..

ఫార్ములా ఈ కారు రేసును స్పాన్సర్‌ చేయడానికి ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ అనే కంపెనీ ముందుకు వచ్చింది కదా! ఆ కంపెనీ పూర్వాపరాలూ ఇప్పుడు కీలకంగా మారా యి. కేవలం రూ.2 లక్షల మూలధనంతోనే ఆ కంపెనీ ఏర్పాటైంది. అది కూడా ఒప్పందం కుదుర్చుకోవడానికి కేవలం నాలుగు నెలల ముందే. గ్రీన్‌ కోలో డైరెక్టర్లుగా ఉన్న వ్యక్తులు వ్యక్తిగత హోదాలో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం 2022 అక్టోబరు 25న జరిగితే.. దానికి కేవలం 4 నెలల ముందు అంటే.. జూన్‌ 29న రూ.2 లక్షల పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌తో ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీని రిజిస్టర్‌ చేశా రు. కంపెనీ డైరెక్టర్లుగా అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి, మహేశ్‌ కొల్లి ఉన్నారు. వీరిద్దరూ దేశంలోనే అతి పెద్ద ఎనర్జీ కంపెనీ అయిన గ్రీన్‌కోలో డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిజానికి, గ్రీన్‌ కో వ్యాపారానికి, ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌కు, ఫార్ములా ఈ కారు రేస్‌ నిర్వహణకూ ఎలాంటి సంబంధం లేదు. అయినా.. తమకు తెలియని స్పోర్టింగ్‌, రిక్రియేషన్‌ కంపెనీని అనిల్‌, మహేశ్‌ ఎందుకు ప్రారంభించారు? కేవలం స్పాన్సరర్‌ అవతారం ఎత్తడానికే ఏస్‌ నెక్ట్స్‌జన్‌ కంపెనీ ఏర్పాటైందా? తెర వెనక తతంగం ఏమిటి? అన్న విషయాలపై ఇప్పుడు ఏసీబీ లోతుగా దృష్టిపెట్టింది. ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా.. ఎఫ్‌ఈవోకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఎందుకు తప్పుకొందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరు ఉన్నారనే అంశంపై దృష్టిసారించారు.


తప్పు మీద తప్పు

ఇప్పటి వరకూ స్పాన్సరర్‌గా ఉన్న ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ తమకు చెల్లించాల్సిన డబ్బులను ఇవ్వలేదంటూ ఎఫ్‌ఈవో ప్రతినిధులు పురపాలక ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పాన్సరర్‌ ఉంటే పదో సెషన్‌ను పూర్తి చేయవచ్చని సూచించారు. దాంతో, పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పురపాలక శాఖకు ఏమాత్రం సంబంధం లేకపోయినా.. స్పాన్సర్‌ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలంటూ అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు పదో సెషన్‌కు సంబంధించి పురపాలకశాఖ స్పాన్సరర్‌గా ఉంటుందం టూ సంబంధిత ఫైల్‌ను 2023 సెప్టెంబరు 27న అప్పటి మంత్రి కేటీఆర్‌కు చేరింది. పదో సెషన్‌ నిర్వహణకు ఎఫ్‌ఈవోకు 90 లక్షల పౌండ్లు చెల్లించడానికి అనుమతిని కోరుతూ దీనిలో పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్‌ సంతకం చేశారు. తద్వారా స్పాన్సరర్‌ బాధ్యతను కూడా పురపాలక శాఖ నెత్తికెత్తుకొంది. ఇందుకుగాను ఎఫ్‌ఈవోకు పన్నులతో కలిపి రూ.56 కోట్లు చెల్లించారు. ఇక్కడే మరో రెండు అంశాలు కూడా ఉన్నాయి. నిజానికి, ఇక్కడ పురపాలక శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు క్యాబినెట్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, దానిని తీసుకోలేదు. పైగా, పురపాలక శాఖ నుంచి కాకుండా హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి ఆ చెల్లింపులు చేశారు. హెచ్‌ఎండీఏకు, ఫార్ములా ఈ కారు రేస్‌ నిర్వహణకు అస్సలు ఏమాత్రం సంబంధం లేదు. కానీ, దాని ఖాతా నుంచి చెల్లింపులు చేయడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచి ఎఫ్‌ఈవోకు డాలర్లలో చెల్లింపులు చేశారు. ఇలా ఓ విదేశీ సంస్థకు డాలర్లలో చెల్లింపులు చేస్తే.. అందుకు ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, దాని నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోకపోవడం నిబంధనల ఉల్లంఘనగా ఏసీబీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రైవేటు స్పాన్సరర్‌ పాత్రలోకి పురపాలక శాఖ చేరడం నుంచి డాలర్లలో చెల్లింపుల వరకూ అన్నింటా పూర్తిస్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘన, క్యాబినెట్‌ అనుమతి తీసుకోకపోవడం, రెండో ఒప్పందం అమల్లోకి రావడానికి ముందే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రెండు విడతలుగా ఎఫ్‌ఈవోకి డబ్బు చెల్లించడం, తదితర విషయాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని కౌంటర్‌ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.


అది వ్యక్తిగత ఒప్పందమే..

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం తమ దృష్టికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ త్రైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసింది. ఒప్పందం రద్దు చేసినందుకు తమకు పరిహారం చెల్లించాలంటూ ఎఫ్‌ఈవో సంస్థ బ్రిటన్లోని ఆర్బిట్రేషన్‌ కోర్టులో దావా వేసింది. మిగిలిన నిధులు చెల్లించకపోతే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని సర్కారుకు లేఖ కూడా రాసింది. దీనిపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ‘మీకు పరిహారం కట్టడం కాదు. ఇప్పటికే తీసుకున్న ప్రజాధనాన్ని తిరిగి ఇవ్వాల్సిందే. గతంలో ఫార్ములా-ఈ ఒప్పందం వ్యక్తిగతంగా ఓ అధికారితో చేసుకున్నది మాత్రమే. దానికి ప్రభుత్వ అనుమతి కానీ, ఆర్థిక శాఖ అనుమతి కానీ లేవు. ఇప్పటికే చేసిన చెల్లింపులే ఓ మోసం. ఆర్థిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్యాబినెట్‌కు ఎలాంటి సంబంధం లేకుండా ఓ వ్యక్తి చెల్లింపులు చేశారు. సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. ఆ అధికారి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు’’ అంటూ ఎఫ్‌ఈఓకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ పంపిన లేఖలో బదులిచ్చారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా వ్యక్తిగత ఒప్పందం కావడంతో ఒప్పంద ఉల్లంఘన ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా వ్యక్తిగతంగా ఒప్పందం చేసుకుని రూ.46 కోట్లు తీసుకున్నారని, ఆదాయపు పన్ను శాఖకు రూ.8 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని, మొత్తం రూ.56 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని అందులో స్పష్టం చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించారు. దాంతో, సదరు సంస్థ వెనక్కి తగ్గింది. ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ను ప్రస్తుతానికి ఉపసంహరించుకుంది.


ఈ-మెయిళ్లు తవ్వితీస్తున్న ఏసీబీ

ఫార్ములా-ఈతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ మెయిల్స్‌ ద్వారా సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఫార్ములా-ఈ ప్రతినిధులు రాష్ట్రానికి రావడం నుంచి ఒప్పందం రద్దు అయ్యేంతవరకు సాగించిన లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలను జల్లెడ పడుతోంది. ఇందులో ప్రారంభంలో జరిగిన ఒప్పంద చర్చల మెయిల్స్‌ కూడా ఉన్నాయి. సదరు చర్చల్లో తాను లేనని, అధికారులు చెప్పారనే తాను సంతకాలు చేశానని మాజీ మంత్రి కేటీఆర్‌ వాదిస్తుండడంతో ఆయన ప్రత్యక్ష పాత్ర ఉందని నిరూపించే ఈ-మెయిళ్లను కూడా ఏసీబీ సేకరించింది. గత ఒప్పందాలపై జరిగిన చర్చల్లో అర్వింద్‌ కుమార్‌తోపాటు కేటీఆర్‌ కూడా పాల్గొన్నారని, వారి సమక్షంలోనే అంతా ఖరారైందని ఫార్ములా-ఈ సంస్థ పేర్కొన్న ఈ-మెయిళ్లను ఏసీబీ సేకరించింది.

Updated Date - Jan 03 , 2025 | 03:40 AM