Share News

CM Revanth Reddy: హైదరాబాద్‌కు మల్లన్న సాగర్‌నీళ్లు

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:36 AM

హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్‌-2 ప్రాజెక్టుకు గోదావరి జలాలను మల్లన్న సాగర్‌ నుంచి తీసుకోవాలా? కొండపోచమ్మ సాగర్‌ నుంచి తీసుకోవాలా? అనే సందిగ్ధానికి తెరపడింది.

CM Revanth Reddy: హైదరాబాద్‌కు మల్లన్న సాగర్‌నీళ్లు

  • 20 టీఎంసీల తరలింపునకు జల మండలి ఆమోదం

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో గోదావరి ఫేజ్‌-2 ప్రాజెక్టుకు ఓకే

  • మంజీరా పాత లైను స్థానంలో కొత్త పైప్‌లైన్‌ నిర్మించండి

  • కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేలా డీపీఆర్‌: సీఎం

  • రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి జలమండలి బోర్డు భేటీ

  • గ్రామీణ రోడ్లకు రూ.వెయ్యి కోట్లు.. నెల నెలా విడుదల

  • అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్‌-2 ప్రాజెక్టుకు గోదావరి జలాలను మల్లన్న సాగర్‌ నుంచి తీసుకోవాలా? కొండపోచమ్మ సాగర్‌ నుంచి తీసుకోవాలా? అనే సందిగ్ధానికి తెరపడింది. నీటి లభ్యత, ఎత్తిపోత వ్యయాలను దృష్టిలో పెట్టుకొని మల్లన్న సాగర్‌ నుంచే తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన జలమండలి బోర్డు సమావేశంలో నిర్ణయించారు. సమగ్ర కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జల మండలి బోర్డు తొలి సమావేశం ఇదే! 11 ఏళ్ల తర్వాత జరిగిన సమావేశంలో బోర్డు చైర్మన్‌ హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో ఉన్న జనాభాకు సరిపడా తాగునీటిని సరఫరా చేస్తున్నామని, మొత్తం 9,800 కిలోమీటర్ల తాగునీటి పైపు లైన్‌ వ్యవస్థ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లకు నీటిని సరఫరా చేస్తున్నామని సీఎంకు అధికారులు నివేదించారు. మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నదుల నుంచి ఈ నీటిని తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి ఫేజ్‌-2 ద్వారా మరింత నీటిని తెచ్చుకొని ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ వరకు సరఫరాకు సంబంధించి డిజైన్‌ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించారు. గతంలో ప్రతిపాదించినట్లు మల్లన్న సాగర్‌ నుంచి 15 టీఎంసీలకు బదులు నగర అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తెచ్చుకోవడానికి ఆమోదం తెలిపారు.


రాబోయే 25 ఏళ్లకు తాగునీటి ప్రణాళికలు

రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంచినీటి సరఫరాకు ప్రణాళికను తయారు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఈ ప్రణాళిక ఉండాలని నిర్దేశించారు. ఇంటింటికీ తాగునీటితోపాటు సీవరేజీ ప్లాన్‌ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని అన్నారు. ఆరు దశాబ్దాలుగా మంజీరా నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న పైపు లైన్లకు కాలం చెల్లిందని, వీటికి మరమ్మతులు వస్తే దాదాపు పది నుంచి 15 రోజులు నీటి సరఫరా నిలిచిపోతోందని అధికారులు సీఎంకు వివరించారు. దాంతో, పాత లైను వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్‌ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్‌ మిషన్‌ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని నిర్దేశించారు.


తక్కువ వడ్డీతో రుణాలకు ప్లాన్‌ చేయాలి: సీఎం

జలమండలి ఆదాయ వ్యయాల నివేదికను ఎండీ అశోక్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించారు. జలమండలికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, తాగునీటి సరఫరా నిర్వహణ ఖర్చులకు సరిపోతోందని వివరించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల నుంచి దాదాపు రూ.4,300 కోట్ల బకాయిలు రావాలని, విద్యుత్తు బిల్లులకు జలమండలి దాదాపు రూ.5,500 కోట్లు బాకీ పడిందని, రూ.1,847 కోట్లు గతంలో తీసుకున్న అప్పులున్నాయని, మొత్తంగా దాదాపు రూ.8,800 కోట్ల రెవెన్యూ లోటు ఉందని వివరించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆదాయ వ్యయాలు ఆశాజనకంగా లేవని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని వెంటనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్దేశించారు. సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను జలమండలి అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటికే ఇంటింటికీ 20 వేల లీటర్ల నీటిని నగరంలో ఉచితంగా సరఫరా చేస్తున్నందున, ఇతర కనెక్షన్ల నుంచి రావాల్సిన నల్లా బిల్లు బకాయిలు క్రమం తప్పకుండా వసూలయ్యేలా చూడాలని అన్నారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని సూచించారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్‌లను తయారు చేయించాలని చెప్పారు.

Updated Date - Jan 04 , 2025 | 04:36 AM