Share News

Balakrishna: త్వరలో బసవ తారకం ఆస్పత్రి విస్తరణ..

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:33 AM

హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని త్వరలో విస్తరిస్తామని, అలాగే ఏపీలోని తుళ్లూరు ప్రాంతంలోనూ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని ఆస్పత్రి చైర్మన్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.

Balakrishna: త్వరలో బసవ తారకం ఆస్పత్రి విస్తరణ..

  • ఏపీలోని తుళ్లూరు వద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం

  • ఆస్పత్రి చైర్మన్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్‌ సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని త్వరలో విస్తరిస్తామని, అలాగే ఏపీలోని తుళ్లూరు ప్రాంతంలోనూ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని ఆస్పత్రి చైర్మన్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బుధవారం ఉదయం ఆస్పత్రిలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో కలసి బాలకృష్ణ కేక్‌ను కట్‌ చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో పాటూ ఆస్పత్రి వైద్యులకు స్వయంగా కేక్‌ను తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వైద్యం చేయాలి, సేవ చేయాలన్న ఆశయంతోనే ఆస్పత్రి నడుస్తోందని చెప్పారు.


సినిమాల్లో, అన్‌ స్టాపబుల్‌ కార్యక్రమాల్లో వినోదాన్ని పంచుతూ ఆస్పత్రి వ్యవహారాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో తనను ఏదో శక్తి నడిపిస్తోందని అన్నారు. ఆస్పత్రి వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని, ఈ సందర్భంగా ఆస్పత్రి పని తీరును పునశ్చరణ చేసుకొని మరింత ముందుకు వెళ్లడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆస్పత్రి పురోగతికి దోహదపడిన దాతలు, గత పాలకమండలి సభ్యులు, పని చేసిన వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు.

Updated Date - Jan 02 , 2025 | 04:33 AM