Share News

Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:13 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్నది హంగామా వ్యవహారమేనన్నారు.

 Bandi Sanjay: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు

  • ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు కేసీఆర్‌ కప్పం

  • లోపాయికారి ఒప్పందం చేసుకున్న రేవంత్‌

  • అందుకే కేటీఆర్‌ను ఏమీ చేయడం లేదు

  • ఫార్మలా-ఈ రేసు కేసులో చర్యలు లేవేం?

  • 700 కోట్ల లాభం ఎలా వచ్చిందో చెప్పాలి.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్‌

కరీంనగర్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్నది హంగామా వ్యవహారమేనన్నారు. శుక్రవారం కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో సంజయ్‌ మాట్లాడారు. క్యాబినెట్‌ ఆమోదం లేకుండా కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. రూ.700 కోట్ల లాభం వచ్చినట్లు డ్రామాలాడుతున్నారని, ఆ లాభం ఎలా వచ్చిందో, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్‌ అడ్డగోలుగా తిడుతున్నా పట్టించుకోకపోవడం వెనుక అంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు కప్పం కడుతున్నందువల్లనే రేవంత్‌రెడ్డి... కేటీఆర్‌ను ఏం చేయలేకపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డ్రామాలు, కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై రాజీలేని పోరు కొనసాగిస్తామన్నారు.


ఫార్ములా-ఈ రేస్‌ స్కాంలో కేటీఆర్‌ తీరుపై బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. క్యాబినెట్‌ అనుమతులు లేకుండా సర్కారు సొమ్మును అప్పనంగా విడుదల చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు. విచారణ పేరుతో అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నారంటే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కేసీఆర్‌తో రేవంత్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు అనుమానం ఉందన్నారు. చిట్టినాయుడు అంటూ బూతులు తిడుతున్నా రేవంత్‌ చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్నారు. కేటీఆర్‌ జైలుకు వెళ్తే బీఆర్‌ఎస్‌ నేతలు గొడవ చేయడానికి ఆయనేమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ బావమరిది ఫాంహౌస్‌ కేసులో డ్రగ్స్‌తో దొరికినా హడావుడి చేసి చివరకు వ్యవహారాన్ని నీరు గార్చారన్నారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌ నుంచి వచ్చినోడేనని.. స్కామ్‌లు తెరమీదకు రాగానే ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టి వస్తున్నాడన్నారు.బీఆర్‌ఎస్‌ అవినీతి, కేసీఆర్‌ కుటుంబ బండారాన్ని ప్రజల ముందుంచి తీరుతామన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 04:13 AM