Bandi Sanjay: ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:20 AM
‘గత బీఆర్‌ఎస్ పాలకులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు పరం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించవద్దు’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేశారు
కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపాలి.. బుల్డోజర్లు దించాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్
సిరిసిల్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘గత బీఆర్‌ఎస్ పాలకులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారు. ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు పరం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించవద్దు’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం రా జన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల భూములను కబ్జా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కలెక్టర్‌ను కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలన్నా, మంచి పనులు చేయాలన్నా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుండా పోయాయని చెప్పారు.
ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటుపరం చేశారని, ఇకపై అలా జరగడానికి వీల్లేదని, బుల్డోజర్లు దించాలన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు పోవాలని భావిస్తున్నానని, దారి తప్పుతున్నోళ్లను దారికి తెచ్చేందుకు యత్నిస్తానని చెప్పా రు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కబ్జా చేసిన స్థలాలు, భవనాలు అన్ని స్వాధీన పర్చుకోవాలని కలెక్టర్, ఎమ్మెల్యేలను కోరారు. ధరణి పేరుతో భూములన్నీ దోచుకున్నారని, ఒక కుటుంబమే లాభపడిందని చెప్పారు. గత పాలకులు ప్రశ్నించే గొంతును నొక్కారని, మధ్యతరగతి వ్యక్తులకు అధికారం వస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.