Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:40 AM
మాదన్నపేట ఉప్పరిగూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని శబరిమల సమీపంలో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది.
డ్రైవర్ మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
సైదాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మాదన్నపేట ఉప్పరిగూడకు చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని శబరిమల సమీపంలో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబరు 26న మాదన్నపేట ఉప్పరిగూడ నుంచి 26 మంది అయ్యప్పస్వాములు ట్రావెల్స్ బస్సు అద్దెకు తీసుకుని పయనమయ్యారు. ఈ నెల ఒకటో తేదీ తెల్లవారు జామున ఎరుమేలిలో దర్శనం చేసుకుని శబరిమలకు పయనమయ్యారు. మార్గం మధ్యలో ఘాట్ రోడ్డు మలుపులో బస్సు అదుపుతప్పి బారికేడ్లను ఢీకొట్టి లోయలోకి దూసుకువెళ్లింది.
బస్సు మూడు భారీ వృక్షాలపై ఒరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ సీటు వెనుక వైపు పడుకున్న మరో డ్రైవర్ రాజు(52) బస్సు ముందు గ్లాస్‌గుండా ఎగిరి లోయలో పడి మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగ్రాతులను కొట్టాయం వైద్య కళాశాలకు తరలించి చికిత్స చేయించారు. ప్రమాదానికి డ్రైవర్ శివ నిర్లక్ష్యమే కారణమని బాధిత అయ్యప్పస్వాములు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు ఫోన్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన స్పందించి కొట్టాయం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అనంతరం స్వాములందరికి శబరిమలలో ప్రత్యేక దర్శనం చేయించారు. అంతేకాకుండా బస్‌డ్రైవర్ రాజు మృతదేహం పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లో అతడి స్వగ్రామానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.