Share News

CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:03 AM

తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పోటీ అని చాలామంది అంటుంటారని, కానీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిసి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి

  • సమస్యలుంటే చర్చించుకుని పరిష్కరించుకుందాం

  • ఐటీ, ఫార్మాల్లో అత్యున్నత స్థాయిలో తెలుగువారు

  • హాలీవుడ్‌తో పోటీ పడుతున్న తెలుగు సినిమా రంగం

  • గతంలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా తెలుగునేతలు

  • ప్రస్తుతం అటువంటి ప్రభావం చూపలేకపోతున్నాం

  • సైబరాబాద్‌తో ఐటీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే..

  • దానిని వైఎ్‌సఆర్‌ మరింత ముందుకు తీసుకెళ్లారు

  • ప్రపంచంలోని తెలుగువారు పెట్టుబడులు పెట్టండి

  • సింగిల్‌ విండోలో అనుమతులిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

  • ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు హాజరు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పోటీ అని చాలామంది అంటుంటారని, కానీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిసి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆ దిశగా ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ, తెలంగాణ పోటీ పడే కన్నా.. రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి పథం వైపు నడిస్తే కచ్చితంగా ప్రపంచంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా రాణిస్తాయని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలున్నా.. చర్చించుకుని పరిష్కరించుకుందామని అన్నారు. దేశాల మధ్య యుద్ధాలు తలెత్తినప్పుడు కూడా చర్చల ద్వారా పరిష్కారమైన సందర్భాలున్నాయని, రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోడానికి ఆ విధంగా ఆలోచన చేయలేమా! అని వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు ఉత్సవానికి సీఎం రేవంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత నార్నే విజయలక్ష్మి సంపాదకత్వంలో వెలువడిన ‘‘తెలుగుదనం- తెలుగు ధనం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.


ప్రముఖ సినీనటులు జయప్రద, జయసుధ, మురళీమోహన్‌, సాయికుమార్‌, నిర్మాత అశ్వినీదత్‌ తదితరులను సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దివంగత నేత నందమూరి తారకరామారావు చేతులమీదుగా 30 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ సంస్థ 12వ ద్వైవార్షికోత్సవంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి జనాభా 18కోట్ల మంది పైచిలుకు అని ఒక అంచనా. అయినా జాతీయ రాజకీయాలపై తెలుగువాళ్లం ప్రభావం చూపలేకపోతున్నాం’’అని రేవంత్‌ అన్నారు. గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నర్సింహారావు, ఎన్టీ రామారావు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని, ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు ప్రభావం చూపించారని గుర్తు చేశారు. రెండు, మూడు తరాలకు మధ్య.. చంద్రబాబు, వైఎ్‌సఆర్‌ ప్రభావం చూపించినా.. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందన్నారు. అయితే ఐటీ, ఫార్మా రంగాల్లో తెలుగువారు ఎందరో అత్యున్నత స్థాయిల్లో రాణిస్తున్నారని తెలిపారు.


దేశంలో 35 శాతం ఔషధాలు (బల్క్‌ డ్రగ్స్‌) హైదరాబాద్‌లోని తెలుగువారి కంపెనీల నుంచి ఉత్పత్తి అవుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానన్నారు. నాడు ప్రధాని రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసి, సాంకేతిక రంగంలో దూసుకెళ్లగలిగేందుకు అవసరమైన పునాదులు నిర్మించారని చెప్పారు. దానిని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నారా చంద్రబాబు అందిపుచ్చుకుని సైబరాబాద్‌ను ప్రపంచంతోనే పోటీపడే విధంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. తర్వాత వైఎస్‌ దానిని మరింత ముందుకు తీసుకెళ్లారని వెల్లడించారు. ‘‘హైదరాబాద్‌ నగరాన్ని మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా, సికింద్రాబాద్‌ను ఆంగ్లేయులు, నిజాం నవాబులు, సైబరాబాద్‌ను నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తే.. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని 30 వేల ఎకరాల్లో ఫోర్త్‌ సిటీ పేరుతో ఒక అత్యాధునిక మహానగరాన్ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయి నగరాలకు దీటుగా దీనిని రూపొందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం’’ అని రేవంత్‌ చెప్పారు.

1 copy.jpg


రాజకీయాల్లోకి వచ్చాకే విలువ తెలిసింది..

చిన్నతనం నుంచి ఉన్నత విద్య వరకు ఆంగ్ల మాధ్యమంలో చదివిన తనకు రాజకీయాల్లోకి వచ్చాకే తెలుగు విలువ తెలిసిందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తించి.. ఇప్పుడు తన మనుమలకు తెలుగు నేర్పిస్తున్నట్లు తెలిపారు. మలేసియా ప్రతినిధుల నృత్య ప్రదర్శన, పద్యాల ఆలాపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, వ్యాఖ్యాతగా వ్యవహరించిన నటుడు బాలాదిత్య ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌...’’అంటూ రేవంత్‌ సమక్షంలోనే తడబడ్డారు.


హాలీవుడ్‌తో పోటీ పడుతున్న తెలుగు సినిమా

తెలుగు సినిమా రంగం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, హాలీవుడ్‌తో సైతం పోటీపడుతున్న సందర్భాలు చూస్తున్నామని సీఎం రేవంత్‌ ప్రశంసించారు. ‘‘రాజకీయాలు, ఆర్థిక, సామాజిక, సినీరంగాలలో రాణించడానికి ఏ భాషనైనా నేర్చుకోండి. కానీ, తోటి తెలుగువారితో మన మాతృభాషలోనే మాట్లాడండి. విదేశాల్లోని తెలుగు వారంతా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఆలోచన చేయాలి. తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాబోయే 25 ఏళ్లకు తగిన ఒక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలుగువారంతా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. పెట్టుబడులు పెట్టండి. అందుకు అవసరమైన అనుమతులన్నింటినీ సింగిల్‌ విండోలో ఇచ్చే బాధ్యత నాది’’ అని రేవంత్‌ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను వీలైనంత వరకు తెలుగులో వెలువరించేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. అంతకుముందు ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి నార్నే విజయలక్ష్మి మాట్లాడుతూ... ఈ కాలానికి తగినట్టుగా పెద్ద బాలశిక్షను సవరించి, ప్రాథమిక స్థాయి విద్యాబోధనలో భాగం చేయాలని సీఎంను కోరగా.. తప్పకుండా విద్యా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని రేవంత్‌ తెలిపారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు నిర్వహించిన ఇందిరాదత్‌ను ప్రశంసించారు.

Updated Date - Jan 06 , 2025 | 05:28 AM