Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:44 AM
హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్‌సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
పొడిగింపునకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్.. ఉత్తర ప్రాంతవాసులకు కొత్త సంవత్సర కానుక
ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్
మూడు నెలల్లో డీపీఆర్.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ ఆదేశం
ఫలించిన మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటం.. ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం
హైదరాబాద్ సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్‌సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు (23 కిలోమీటర్లు), జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు (22 కిలోమీటర్లు) మెట్రోరైలును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సమావేశమైన సీఎం.. ఈ మేరకు రెండు కారిడార్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయా కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణకు నిర్ణయించిన ప్రభుత్వం.. పార్ట్-ఎ కింద ఆరు కారిడార్లను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
తాజాగా నార్త్ సిటీకి సంబంధించి రెండు కారిడార్లను పార్ట్-బి కింద చేపట్టనుంది. వీటికి సంబంధించిన డీపీఆర్‌లను రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని సీఎం సూచించారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రాజెక్టును రూపొందించాలని సీఎం సూచించడంతో స్థానికులు సంతోషపడుతున్నారు. వాస్తవానికి నగరంలో ప్రజా రవాణాలో అతి కీలకమైన మెట్రో రైలుకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకుని నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుకునే విధంగా దోహదపడుతున్న మెట్రో కోసం కొంతకాలంగా వివిధ ప్రాంతాల ప్రజలు పోటీ పడుతున్నారు. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మహానగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నార్త్‌సిటీకి మెట్రోను నడిపించాలని స్థానికులు కొన్ని నెలలుగా గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు 2024 జనవరి 29న మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
నార్త్‌సిటీలో ఈ కారిడార్లకు డిమాండ్..
హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్యారడైజ్ నుంచి తాడ్‌బండ్-బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేషన్-మిలిటరీ డెయిరీఫామ్ రోడ్డు-కొంపల్లి-మేడ్చల్ వరకు (22 కిలోమీటర్లు), జేబీఎస్ నుంచి శామీర్‌పేట్-తూముకుంట వరకు (19 కిలోమీటర్లు), తార్నాక నుంచి ఈసీఐఎల్-నాగారం-కీసర వరకు (20 కిలోమీటర్లు), బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేషన్ నుంచి మూసాపేట్ వై జంక్షన్-బాలానగర్-సూరారం-గండిమైసమ్మ వరకు (21 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లను నిర్మించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు కోరుతూ వస్తున్నారు. రెండో దశలోనే ఈ పనులను చేపట్టాలని, తద్వారా స్థానికులకు మెట్రో రైలు రవాణా సౌకర్యం లభించడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఏడాది కాలంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనల ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను చెప్పారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ పెద్దలను, మెట్రో రైలు అధికారులను తరచూ కలుస్తూ విజ్ఞాపన పత్రాలను అందజేస్తున్నారు. కాగా, నార్త్‌సిటీలో ఆయా ప్రాంతాలకు చెందిన 25 వేల మందితో ఆన్‌లైన్ ద్వారా సంతకాల సేకరణ చేపట్టి ప్రధాని నరేంద్రమోదీకి, సీఎం రేవంత్‌రెడ్డికి పంపించారు. ఉత్తర ప్రాంతానికి మెట్రో రైలు వస్తే లక్షలాది మందికి ప్రతిరోజూ మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం..
మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పార్ట్-ఎ లోని ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను 2024 నవంబరు 4న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో హెచ్‌ఏఎంఎల్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ డీపీఆర్‌కు మరో మూడు నెలల్లో గ్రీన్‌సిగ్నల్ లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే నార్త్‌సిటీలో గతంలో ప్రతిపాదించిన కారిడార్లను కూడా రెండో దశలోనే చేర్చి పనులను పూర్తి చేయాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు మూడు నాలుగు నెలలుగా తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. కాగా, ఆన్‌లైన్ ద్వారా సేకరించిన సంతకాలకు స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కార్యాలయం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, హైదరాబాద్ మెట్రో రైలు కార్యాలయానికి లేఖలు రావడంతో ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు.
మిగతా రెండు కారిడార్లను చేర్చండి
నార్త్‌సిటీ మెట్రోకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతానికి మెట్రో రైలు కావాలని కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నాం. మా ఆకాంక్షను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని కొత్త సంవత్సరం రోజున గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్యారడైజ్- మేడ్చల్, జేబీఎ్‌స-శామీర్‌పేట మాదిరిగానే తార్నాక-ఈసీఐఎల్-కీసరవరకు, బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేషన్-గండిమైసమ్మ కారిడార్లను కూడా రెండో దశలోనే చేర్చాలి. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిస్తేనే నగరం మరింత అభివృద్ధి చెందుతుంది.
- మామిడి సంపత్‌రెడ్డి, మేడ్చల్ మెట్రోసాధన సమితి వ్యవస్థాపక సభ్యుడు
హైదరాబాద్ మెట్రో రైలు
ప్రాజెక్టు స్వరూపం (కి.మీ.లలో)
మొదటి దశ
కారిడార్-1 (ఎల్‌బీనగర్-మియాపూర్) 29
కారిడార్-2 (జేబీఎ్‌స-ఎంజీబీఎస్) 11
కారిడార్-3 (నాగోల్ - రాయదుర్గం) 29
రెండో దశ- పార్ట్-ఎ
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట 7.5
నాగోల్-ఎల్‌బీనగర్-చాంద్రాయణగుట్ట
-ఆరాంఘర్-శంషాబాద్ 36.4
రాయదుర్గం - కోకాపేట నియోపోలిస్ 11.6
మియాపూర్ - బీహెచ్‌ఈఎల్- పటాన్‌చెరు 13.4
ఎల్‌బీనగర్ - వనస్థలిపురం- హయత్‌నగర్ 7.1
శంషాబాద్ ఎయిర్‌పోర్టు-ఓఆర్‌ఆర్
మీదుగా కొంగరకలాన్- ఫోర్త్ సిటీ 40
రెందో దశ- పార్ట్-బి
ప్యారడైజ్- మేడ్చల్ 23
జేబీఎస్ - శామీర్‌పేట 22
కారిడార్ల నిర్మాణం ఇలా..
రెండో దశలో పార్ట్-బి కింద రెండు కారిడార్లను చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి.. హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ప్యారడైజ్- మేడ్చల్ కారిడార్‌లో భాగంగా ప్యారడైజ్ మెట్రోస్టేషన్, తాడ్‌బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు, జేబీఎ్‌స-శామీర్‌పేట్ కారిడార్ కింద జేబీఎస్, విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు కారిడార్ విస్తరించి ఉంటుందని హెచ్‌ఏఎంల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కాగా, గతంలో మల్కాజిగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన తనకు నార్త్‌సిటీ ప్రాంత ట్రాఫిక్ సమస్యలపై, ఆయా కారిడార్ల రూట్ మ్యాప్‌లపై అవగాహన ఉందని, అయినప్పటికీ రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎండీ తెలిపారు. డీపీఆర్ తయారీని మూడు నెలల్లోగా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. సీఎం ఆదేశాలతో డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.