Share News

CM Revanth Reddy: నేను మారాను.. మీరూ మారండి!

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:08 AM

‘నేను మారాను.. మీరూ మారాలి’అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy: నేను మారాను.. మీరూ మారండి!

ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయమిస్తా.. అందరి రిపోర్టు కార్డు నా దగ్గరుంది

  • నా గురించి మీరనుకున్నట్టే.. మీ గురించి

  • కింది స్థాయి నేతలు అనుకుంటారు

  • పని చేయని వారిని ఉపేక్షించేది లేదు

  • స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీ్‌ప చేయనున్నాం!

  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్‌

  • చైర్మన్లు 4 స్తంభాల్లా నిలబడి పనిచేయాలి

  • పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డోళ్లకే టికెట్లు

  • కుదరని చోట నామినేటెడ్‌ పోస్టుల్లో..

  • కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘నేను మారాను.. మీరూ మారాలి’అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానని అన్నారు. నిరుటితో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందన్నారు గత ఏడాదికి భిన్నంగా తాను బుధవారం ఉదయం నుంచి మంత్రులకు, ఇతర నేతలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నానని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలూ కిందిస్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపాలని, వారి యోగక్షేమాలు ఆరా తీయాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని గుర్తుచేస్తూ... పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరి పనితీరుకు సంబంధించి రిపోర్టు కార్డు తన దగ్గర ఉందని, ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారు.. ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది తనకు తెలుసునన్నారు.


పని చేయని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తన పనితీరుపైనా రిపోర్టు కార్డును తెప్పించుకున్నానని చెప్పారు. ‘‘నా గురించి మీరు అనుకుంటున్నట్టే మీ గురించీ కింది స్థాయి నేతలూ అనుకుంటారు అని గుర్తెరగాలి’’ అని వ్యాఖ్యానించారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు మంత్రులు, పార్టీ ప్రజా ప్రతినిధులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో రేవంత్‌ అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు బాలూ నాయక్‌, మధుసూధన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, మఖన్‌సింగ్‌ ఠాకూర్‌, రాజేశ్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పర్ణికా రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మత్స్య కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఏడాది పాలనలో తెలిసి తప్పుచేయలేదు

రానున్న వంద రోజుల్లో పురపాలికలు సహా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికానున్నాయని భేటీ సందర్భంగా నేతలతో రేవంత్‌ చెప్పారు. ‘‘వచ్చే వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేయబోతోంది. ఎలాగూ గెలుస్తున్నం కదా అని ఆటను లైట్‌గా తీసుకోవొద్దు. భారం మొత్తం కెప్టెన్‌పైనే వదిలేయొద్దు. ఫీల్డింగ్‌, కీపింగ్‌, బౌలింగ్‌.. ఇలా ఎవరి నైపుణ్యాన్ని వారు సమష్టిగా ప్రదర్శిస్తేనే ఆటను గెలుస్తం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నాలుగు స్థంభాల్లా నిలబడి అభ్యర్థుల్ని గెలిపించాలి’’ అని వ్యాఖ్యానించారు. రుణమాఫీ సహా రైతులకు అమలు చేసిన పథకాల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో సానుకూలత ఉందని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా అమలు చేయనున్నామని చెప్పారు. వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసికట్టుగా పనిచేసి.. కార్యకర్తలనూ కలుపుకొని వెళ్లాలని సూచించారు. ఎలాంటి గ్రూపు తగాదాలూ లేకుండా చూసుకోవాలని, ఉన్నచోట్ల సర్దుకుపోయి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ‘‘ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు. తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నాం’’ అని వ్యాఖ్యానించారు. ఏడాది పాలన అనుభవాలు వచ్చే నాలుగేళ్లకు ఉపయోగపడతాయన్నారు. అంగన్‌వాడీలు, డీలర్ల నియామకాల్లో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలంటూ ఓ మంత్రి కోరగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేపట్టకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పారు.


పార్టీ కోసం కష్టపడ్డోళ్లకే టికెట్లు!

పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కనీసంగా 80 శాతం టికెట్లు మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నేతలకే ఇవ్వాలన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేకపోయిన చోట్ల.. జిల్లా స్థాయిల్లో ఉండే నామినేటెడ్‌ పోస్టుల్లో వారిని సర్దుబాటు చేయాలని సూచించారు. అన్ని మునిసిపాలిటీలు, జెడ్పీల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించే విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పని చేయాలన్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆషామాషీగా గెలిచిన వారు కాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులను గెలిపించి వారి సమర్థత నిరూపించుకోవాలని సూచించారు.


నవ వసంతంలో విజయ గీతికగా..

ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నవ వసంతంలో విశ్వవేదికపై.. విజయ గీతికగా తెలంగాణ స్థానం.. ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం సుఖ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ బుధవారం తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. కాగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యం రూ.20లక్షలను అందజేసింది. ఈ మేరకు బుధవారం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత చెక్కును సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కలిసి అందజేశారు.

Updated Date - Jan 02 , 2025 | 03:08 AM