Share News

CM Revanth Reddy: కలెక్టర్లూ.. మారండి!

ABN , Publish Date - Jan 11 , 2025 | 02:25 AM

జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడంలేదని, ఆఫీసుల్లోనే కూర్చుని పని చేయాలనుకుంటున్నారని తప్పుబట్టారు.

CM Revanth Reddy: కలెక్టర్లూ.. మారండి!

కొందరు క్షేత్ర స్థాయికి వెళ్లడంలేదు.. ఆఫీసుల్లోనే కూర్చుని పని చేయాలనుకుంటున్నారు

  • ఇష్టం లేకుంటే చెప్పండి.. వేరేచోటకు పోస్టింగ్‌

  • నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

  • ఈ నెల 26 నుంచి 4 ప్రతిష్ఠాత్మక పథకాలు

  • 24 లోగా గ్రామ సభలను నిర్వహించాలి

  • అర్హులందరికీ ‘రైతు భరోసా’ సొమ్ము ఇవ్వండి

  • భూమిలేని కూలీలకు ‘ఆత్మీయ భరోసా’

  • గతంలోని అర్హతలతోనే కొత్త రేషన్‌ కార్డులు

  • ముందుగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

  • కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

  • 26 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడంలేదని, ఆఫీసుల్లోనే కూర్చుని పని చేయాలనుకుంటున్నారని తప్పుబట్టారు. ఇది మంచి పద్ధతి కాదని, వారు మారాలని, ఇక నుంచైనా క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. ఐఏఎస్‌ అధికారి జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం ఓ మధురానుభూతి అని చెప్పారు. ‘‘ఒకవేళ ఎవరికైనా కలెక్టర్‌గా పనిచేయడం ఇష్టం లేకపోతే చెప్పండి.. వేరేచోట పోస్టింగ్‌ ఇస్తా’’ అని అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేశారు. ‘‘గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఒక జిల్లాకు వెళ్లాలన్నా, ఏదైనా తండాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లి రావాలన్నా కనీసం రెండు రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమస్య లేదు.. ఏ జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లి రావాలన్నా రెండు, మూడు గంటల్లో తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. కలెక్టర్లు అందరూ జిల్లాల్లో పర్యటనలు చేయాలి. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలి. మీరు మంచి పేరు తెచ్చుకుని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలి’’ అని సీఎం రేవంత్‌ అన్నారు. మహిళా ఐఏఎ్‌సలతోపాటు ఐపీఎస్‌ అధికారులు కూడా నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టళ్లను సందర్శించాలని, అక్కడే రాత్రి బస చేసి.. విద్యార్థుల అవసరాలను, సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. వారి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది కలెక్టర్లేనని, వారి పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అవుతుందని అన్నారు. ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. ఇటీవల కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశారంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను అభినందించారు.


26 నుంచి ఆ నాలుగు పథకాలు..

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయినందున.. ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఉందని సీఎం రేవంత్‌ అన్నారు. ఆరోజు రాష్ట్ర ప్రభుత్వం.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి నాలుగు ప్రతిష్ఠాత్మకమైన పథకాలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కలెక్టర్లు ఈ నెల 15లోగా ఈ పథకాల అమలుకు కావాల్సిన సన్నాహకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల సారథ్యంలో అన్ని జిల్లాల్లో నోడల్‌ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని అన్నారు. ఈ నెల 26 తర్వాత తాను జిల్లాలో పర్యటిస్తానన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్ర స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని సీఎం పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందనే విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందన్నారు. ఈ నెల 26న ప్రారంభించనున్న నాలుగు పథకాల అమలుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు సభలను నిర్వహించాలని అన్నారు. ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం సేకరించిన వివరాలు, తయారు చేసిన జాబితాలను గ్రామ సభల్లోనే వెల్లడించాలన్నారు.


అలాంటి పొరపాటు జరగొద్దు..

గతంలో రైతుబంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయిందని, గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించిందని సీఎం రేవంత్‌ అన్నారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని హెచ్చరించారు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా సొమ్మును చెల్లించాలని, అదే సమయంలో అనర్హులు ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా చూడాలని అన్నారు. ప్రతి జిల్లాకు, మండలానికి ఓ నోడల్‌ అధికారిని నియమించాలని, అధికారుల బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్లి అనర్హులను గుర్తించాలని ఆదేశించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా సొమ్మును చెల్లించాలని, వ్యవసాయానికి అక్కరకురాని భూములను గుర్తించి, వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలని అన్నారు.


రియల్‌ ఎస్టేట్‌ భూములు, లే-అవుట్‌ భూములు, నాలా కన్వర్షన్‌ అయిన భూములు, మైనింగ్‌ భూములు, గోదాములు, ఫంక్షన్‌ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములు ఈ అనర్హత జాబితాలోకి వస్తాయని వివరించారు. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డీటీసీపీ లే-అవుట్‌ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితాలను తయారు చేయాలన్నారు. విలేజ్‌ మ్యాప్‌లతో పాటు అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి వీటిని ధ్రువీకరించుకుని, వీటిని గ్రామ సభలో ప్రచురించాలని చెప్పారు. రైతులు ఎలాంటి అనుమానాలు, అపోహలకు గురికావొద్దని, పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికీ రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు.


20 రోజులు ఉపాధి పనులు చేస్తేనే..

భూమి లేని నిరుపేద, ఉపాధి కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం రేవంత్‌ చెప్పారు. ఆ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల నగదు సాయం అందిస్తామన్నారు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఇక కొత్త రేషన్‌ కార్డులను.. గతంలో ఉన్న అర్హత నిబంధనల ప్రకారమే జారీ చేస్తామన్నారు. ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో రేషన్‌ కార్డులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ‘వన్‌ రేషన్‌- వన్‌ స్టేట్‌’ విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డుల లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు.


ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గూడు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్‌ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామన్నారు. అందులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేశామని, ఇందిరమ్మ ఇళ్లకు అరు?లైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆమోదంతో ఈ అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రచురించాలన్నారు. సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 02:25 AM