Share News

Telangana: సీఎం నోట.. షాకింగ్ మాట..

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:38 PM

ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. హస్తిన వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. దేశ రాజధానిలోనూ.. రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనుమానాస్పద మరణాలు, అవినీతి కేసులు, కేంద్ర ప్రభుత్వం తీరు.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు సీఎం. మరి ఆయన ఇంకా ఏం మాట్లాడారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే..

Telangana: సీఎం నోట.. షాకింగ్ మాట..
CM Revanth Reddy

ఢిల్లీ, ఫిబ్రవరి 26: హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఐదు అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అండగా నిలవాలని ప్రధానిని సీఎం కోరారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు అంశాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.


కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పదంగా మృతి చెందితే.. కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విచారణ కోరతారా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముడు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తి మరణాలపై కేసీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని సీఎం ప్రశ్నించారు. త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రాబోతోందన్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే తాము విచారణ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేదార్ మృతదేహం ఇండియాకు రానుందన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే దుబాయ్‌లోనే ఉన్నారని.. అతను ఎవరు అని ప్రశ్నించారు సీఎం.


ఇదే సమయంలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో 11 సంస్థలు పని చేస్తున్నాయని సీఎం చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎస్‌ఎల్‌బీసీని వందశాతతం పూర్తి చేసి తీరుతామన్నారు. కమీషన్లు రావనే ఉద్దేశంతోనే ఎస్‌ఎల్‌బీసీ పనులను కేసీఆర్ పక్కన పెట్టేశారని సీఎం ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్‌ఎల్బీసీని పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టు పెరిగిన అంచనాలతో కలిపి రూ. 5,000 కోట్ల లోపే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఇది పూర్తయితే.. మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని సీఎం వివరించారు.


బీఆర్ఎస్ హయాంలో అంతా అవినీతే..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతా అవినీతే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పందించిన సీఎం.. ఉప ఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్నారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడూ ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎక్కడుందని ప్రశ్నించారు. పోటీలో లేని వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. అధ్యక్షుడు ఎవరైనా బీజేపీతోనే తమకు పోటీ అని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పని చేస్తోందని ఆరోపించారు.


ఫోన్ టాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న సీఎం.. ఈ విషయంలో కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మెట్రోను కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తులను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద ఉందన్నారు సీఎం. తన వంతుగా చేయాల్సింది తాను చేశానని.. అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ల సొంతం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఇది చేస్తే.. బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి సన్మానం కూడా చేస్తానని సీఎం ప్రకటించారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నులు ఎంత కడుతున్నామో అంతే స్థాయిలో రాష్ట్రాలకు వాటా రావాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, నాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అని గుర్తు చేశారు సీఎం.


ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు మానిటరింగ్ చేస్తోందన్నారు. సీబీఐ కేసులు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవాలని బీజేపీ ఆలోచిస్తోందని ఆరోపించారు సీఎం. ఫార్ములా ఈ, గొర్రెల పంపిణీ కేసులో కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిందని.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారాయన. రాత్రికి రాత్రి తాము ఎవరినీ అరెస్ట్ చేయమని.. అది తమ విధానం కూడా కాదన్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ జరుగుతోందన్నారు సీఎం. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించామన్న సీఎం రేవంత్.. తాము చేస్తున్న పనులకు ప్రచారం కల్పించుకోవడం లేదన్నారు.


ఇక తన కేబినెట్‌లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారందరూ అనుభవజ్ఞులేనని పేర్కొన్నారు. వారి వారి శాఖలో సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో తన పాలన అద్భుతంగా ఉందన్నారు. ఎవరి ఫోన్లలో వారు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ తాను కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.


Also Read:

అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు..

కీలక వీడియో షేర్ చేసిన ట్రంప్.. బాంబుల మోత టూ బంగారం..

మీరు నిజంగా జీనియస్ అయితే.. తాళం చెవిని

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 26 , 2025 | 04:56 PM