KTR: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట దక్కేనా?
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:58 AM
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు ఊరట లభిస్తుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విదేశీ కంపెనీకి చెల్లింపుల వ్యవహారంలో ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ చేసిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు తీర్పు
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌కు ఊరట లభిస్తుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విదేశీ కంపెనీకి చెల్లింపుల వ్యవహారంలో ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ చేసిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో వాదనలు పూర్తి కావడంతో డిసెంబరు31న జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం ఈ వ్యవహారంపై తీర్పు వెలువడనుంది. ఫార్ములా ఈ అపరేషన్స్ అనే విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.46 కోట్లు విదేశీ మారకంలో చెల్లించారని, కేటీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని ఏసీబీ ఆరోపిస్తోంది.
ఎన్నికల నియామవళి అమలులో ఉండగా క్యాబినెట్ అనుమతి లేకుండా, పరిపాలనా అనుమతి లేకుండా, రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకోకుండా విదేశీ కంపెనీకి విదేశీ మారకంలో చెల్లింపులు చేశారని ఏసీబీ చెబుతోంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో తీర్పు ఇచ్చేంత వరకు ఆయనను అరెస్ట్ చేయరాదని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు యథావిధిగా చేసుకోవచ్చని ఏసీబీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం వెలువడే తీర్పు ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చి ఆయనపై కేసు కొట్టేస్తే ప్రభుత్వం ఏంచేస్తుంది? లేదా కేటీఆర్ పిటిషన్‌ను కొట్టేస్తే పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తారా? అని చర్చ జరుగుతోంది. మంగళవారం ఉదయం 10. 30 గంటల నుంచి 11 గంటల మధ్య తీర్పు వెలువడే అవకాశం ఉంది.