New Year Celebrations: దేవాలయాలు కిటకిట!
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:04 AM
కొత్త సంవత్సరం సందర్భంగా బుఽధవారం రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు.
కొత్త సంవత్సర వేళ తరలివచ్చిన భక్తులు
గుట్ట నృసింహుడి దర్శనానికి 50 వేల మంది
వేములవాడకు వేంచేసిన 40 వేల మంది
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : కొత్త సంవత్సరం సందర్భంగా బుఽధవారం రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని బిర్లామందిర్, చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి, సనత్‌నగర్‌లోని రేణుక ఎల్లమ్మ, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లోని షిర్డీసాయి ఆలయాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గంటల కొద్దీ క్యూలైన్లలో బారులుతీరి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాదంతా సుఖశాంతులతో ఉండాలని మొక్కుకున్నారు. యదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దివ్యాంగులు, మహిళలు, చంటిపిల్లల తల్లులను తూర్పు రాజగోపురం వద్దకు తరలించేందుకు ఎలక్ర్టికల్ వాహనాలను వినియోగించారు.
50 వేల మంది భక్తులు లక్ష్మీనృసింహుడిని దర్శించుకోగా, ధర్మ దర్శనానికి రెండు గంటలు, వీఐపీ టికెట్ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని 40 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడలోని బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికీ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామయ్య సన్నిధి, వరంగల్ నగరంలోని భద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మేడ్చల్ జిల్లాలోని కీసర శివాలయం, రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని బాలాజీ దేవాలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది.