Share News

నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ABN , Publish Date - Jan 24 , 2025 | 04:00 AM

‘‘అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా’’.. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లెలగూడ కేసులో నిందితుడైన మాజీ జవాను గురుమూర్తి పోలీసులకు విసిరిన సవాలు ఇది!

నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. కోర్టులోనే చూసుకుంటా.. భార్య హత్య కేసులో పోలీసులకు గురుమూర్తి సవాల్‌

  • ఇంట్లో కనిపించని రక్తపు ఆనవాళ్లు.. దుర్వాసనా లేదు

  • కిచెన్‌లో మాంసం నరికే చెక్క మొద్దు.. మద్యం సీసా

  • హత్య చేసింది వాస్తవం.. మరి ఆ అవశేషాలెక్కడ?

  • స్థానికంగా డ్రైనేజీ మ్యాన్‌హోళ్లలోనూ వెతుకులాట

  • నిందితుడిది కట్టుకథ కాదు కదా? పోలీసుల మల్లగుల్లాలు

సరూర్‌నగర్‌, హైదరాబాద్‌ సిటీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘‘అవును నా భార్యను నేనే చంపాను.. మరి.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్‌ చేయండి.. అంతా కోర్టులోనే చూసుకుంటా’’.. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లెలగూడ కేసులో నిందితుడైన మాజీ జవాను గురుమూర్తి పోలీసులకు విసిరిన సవాలు ఇది! ఇప్పుడు ఆ సాక్ష్యాలను వెతుకులాడే పనిలోనే పోలీసులు తలమునకలయ్యారు. భార్య వెంకట మాధవిని అతడు చంపింది నూటికి నూరుపాళ్లు వాస్తవం! మరి.. ఆ అవశేషాలు ఎక్కడ? కనీసం హత్య చేసినట్లుగా ఆనవాళ్లయినా కనిపించాలి కదా? అని పోలీసులు తలపట్టుకుంటున్నారు. అసలు.. గురుమూర్తి చెబుతున్నది వాస్తవమేనా? మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఉడికించి, వాటిని ఎండబెట్టి దంచి.. ఆ పొడిని చెరువులో కలివేసి ఉంటాడా? లేదూ.. తమను తప్పుదోవ పట్టించేందుకు అల్లిన కట్టుకథ కాదు కదా? విచారణలో గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు ఈ కోణంలోనూ ప్రశ్నలు వేసుకుంటున్నారు.


గురుమూర్తి ఉంటున్న ఇంటి నుంచి అవశేషాలను పడేసినట్లుగా చెబుతున్న జిల్లెలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల డీవీఆర్‌లనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 16 నుంచి మాధవి కదలికలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లోనే ఆమె హత్య జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. శరీర భాగాలను డ్రైనేజీలో వేశాడేమో అనే అనుమానంతో పోలీసులు బుధవారం పరిసర ప్రాంతాల్లోని అన్ని డ్రైనేజీ మ్యాన్‌ హోళ్లను తెరిపించి పరిశీలించారు. అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. బుధవారం వరకు గురుమూర్తిని మీర్‌పేటలోనే పోలీసులు విచారించారు. విషయం బయటకు పొక్కడంతో అదే రోజు రాత్రి అతడిని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్లు సమాచారం! గురువారం రాత్రి వరకు కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి పెదవి విప్పకపోడం గమనార్హం!


వంటగదిలో మాంసం నరికే మొద్దు

భార్యను గురుమూర్తి ఇంట్లోనే హత్య చేసి ఉంటాడనే అనుమానాలకు బలం చేకూరేలా అతడు ఉంటున్న ఇంట్లోని వంటగదిలో మాంసం నరికే చెక్క మొద్దు కనిపించింది. గురుమూర్తి అద్దెకుంటున్న ఇంటి యజమాని, తన కుటుంబంతో కలిసి రెండు నెలల క్రితం బెంగళూరుకు వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు ఆయన్ను పిలిపించి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. అనంతరం ఆయన మళ్లీ ఇంటికి తాళం వేసుకుని బెంగుళూరు వెళ్లిపోయారు. ఆ భవనం రెండో అంతస్తులోని ఓ పోర్షన్‌లో గురుమూర్తి కుటుంబం ఉంటోంది. ఆ ఇంటికి కూడా పోలీసులు తాళం వేశారు. అయితే వంటగది కిటికీలో నుంచి లోపలికి చూస్తే కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద మాంసం నరికే చెక్క మొద్దు, పక్కన ఓ మద్యం బాటిల్‌, పళ్లెంలో చుడ్వా కనిపించాయి. ఓ సెల్ఫ్‌లో రెగ్యులర్‌గా వాడే చిన్న కుక్కర్‌ కనిపించింది. అయితే.. 50 కిలోలు ఉండే మనిషి మాంసాన్ని ఆ కుక్కర్‌లో ఉడికించడం సాధ్యమయ్యే పనేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఇంట్లో ఎలాంటి రక్తం మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవడం పోలీసులను ఆలోచనలో పడేసింది. ఉడికించిన మాంసం ముక్కలతో పాటు ఎముకలను ఎండబెట్టినట్లుగా ప్రచారం జరగుతున్నప్పటికీ అక్కడ ఎండ ప్రసరించే ఛాయలే లేకపోవడంతో దీనికి బలం చేకూరడం లేదు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా గురుమూర్తి పొడిపొడిగానే సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Updated Date - Jan 24 , 2025 | 04:00 AM