Kondapochamma Sagar: ఈత.. గుండెకోత
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:22 AM
ఆ ఏడుగురు యువకులు మధ్యతరగతికి చెందిన బాల్య స్నేహితులు..! అంతా చిన్నచిన్న పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలకు చెందినవారే..! సంక్రాంతి సెలవులను సరదాగా గడుపుదామనుకున్నారు.
కొండపోచమ్మ జలాశయంలో ఐదుగురు యువకుల దుర్మరణం
అంతా హైదరాబాద్ నగర వాసులే..
మృతుల్లో ఇద్దరు సొంత అన్నదమ్ములు
20 నిమిషాలు సాయం కోసం పిలుపు
7 గంటల గాలింపు.. మృతదేహాలు లభ్యం
గజ్వేల్/మర్కుక్, ముషీరాబాద్/కవాడిగూడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆ ఏడుగురు యువకులు మధ్యతరగతికి చెందిన బాల్య స్నేహితులు..! అంతా చిన్నచిన్న పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలకు చెందినవారే..! సంక్రాంతి సెలవులను సరదాగా గడుపుదామనుకున్నారు. అనుకున్నదే తడవుగా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ అందాలను తిలకించి, సెల్ఫీలు దిగి.. సాయంత్రానికి తిరిగి వద్దామనుకున్నారు. అయితే.. వారి స్నేహంపై కన్నుకుట్టిన విధి.. ఐదుగురిని కబళించింది. విహారయాత్ర విషాదంగా ముగిసింది. మరణంలోనూ ఐదుగురు మిత్రులు కలిసి ఉండడం వారి కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్ భోలక్‌పూర్ సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన గ్యార నర్సింగరావు-జయంతిల ఇద్దరు కుమారులు-- ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ గ్యార ధనుశ్(19), టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటేక్ చదువుతూ.. కుటుంబ ఫొటోగ్రఫీ వ్యాపారంలో సాయం చేస్తున్న గ్యార లోహిత్(17), బన్సీలాల్‌పేటకు చెందిన చీకట్ల కిషన్-సుమలతల ఏకైక కుమారుడు చీకట్ల దినేశ్(17), అత్తాపూర్ జనప్రియ కాలనీకి చెందిన అనిత చిన్న కుమారుడు సాహెల్ దీపక్ సుతార్(19), ఖైరతాబాద్ చింతల్‌బస్తీకి చెందిన ఉప్పల కోటేశ్-స్వప్నలకు చిన్న కుమారుడు ఉప్పల జతిన్(17), ముషీరాబాద్ రాంనగర్‌కు చెందిన కొమారి మృగాంక్, ముషీరాబాద్ హ్యారీకాలనీలో నివసించే మహ్మద్ ఇబ్రహీం శనివారం ఉదయం 9 గంటల సమయంలో.. కొండపోచమ్మ దేవాలయానికి వెళ్తున్నట్లు ఇళ్లలో చెప్పి ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు.
మధ్యాహ్నం 12 గంటల సమయానికి మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకున్నారు. సేఫ్టీవాల్ దాటి లోనికి వెళ్లిన వీరంతా.. మధ్యాహ్నం 12.30 సమయంలో సరదాగా నీళ్లలో దిగి సెల్ఫీలు దిగాలనుకున్నారు. మృగాంక్, ఇబ్రహీం గట్టునే ఉండగా.. మిగతావారు నీళ్లలోకి దిగారు. కాసేపటికే ఒకరితర్వాత ఒకరు నీటిలో జారిపడి, గల్లంతయ్యారు. గట్టున ఉన్న ఇద్దరూ ‘‘హెల్ప్.. హెల్ప్..’’ అంటూ అరిచారు. డయల్-100కు ఫోన్‌చేసి, పోలీసులకు సమాచారం అందించారు. నీటిలో మునిగిపోతున్న సాహెల్ కూడా 20 నిమిషాల పాటు.. ‘‘హెల్ప్.. హెల్ప్’’ అంటూ అరుస్తూనే ఉన్నా.. రిజర్వాయర్ లోపల ఉండడంతో ఎవరూ వినలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, గజ్వేల్ ఏసీపీ కె.పురుషోత్తంరెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి, 20 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలను చేపట్టారు. దాదాపు ఏడు గంటల పాటు గాలింపు కొనసాగింది. ఓ దశలో బోట్‌ను తెప్పించి, గాలించారు. సాయంత్రం 5.30 సమయంలో దినేశ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలో మిగతా నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబీకుల రోదనలతో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, గజ్వేల్ ఆస్పత్రి మార్మోగిపోయాయి. నూనుగు మీసాల వయసున్న చిన్నారులు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో.. బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అంతా నిరుపేదలే..
మృతిచెందిన ఐదుగురు యువకులు అంతా నిరుపేదలే. ముగ్గురు మినహా.. మిగతా వారంతా స్విగ్గీ, మెకానిక్ వంటి చిన్నచిన్న పనులు చేస్తూ.. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ధనుష్, లోహిత్‌ల తండ్రి నర్సింగరావు ఫొటోగ్రాఫర్. లోహిత్ ఇంజనీరింగ్ చేస్తున్నా.. తన అన్న ధనుష్, తండ్రికి ఫొటోగ్రఫీలో సహకరించేవాడు. ఇద్దరు కుమారులు చనిపోవడంతో.. ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్న ఉప్పల జతిన్ తండ్రి కోటేశ్ ఆటోడ్రైవర్. ‘‘ఉదయం 7 గంటలకు నా చేతి పాలు తాగి బయలుదేరిన బిడ్డ’’ అంటూ జతిన్ తల్లి స్వప్న కన్నీరుమున్నీరవుతున్నారు. సాహెల్‌కు తండ్రి లేకపోవడంతో.. తల్లి వంటపని చేస్తూ, పిల్లలను పోషిస్తున్నారు. సికింద్రాబాద్ చాచానెహ్రూనగర్‌కు చెందిన కిషన్, సుమలత కుమారుడు దినేశ్ డిప్లొమా చదువుతున్నాడు. కిషన్ డ్రైవర్‌గా.. సుమలత ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోనే లోహిత్, దినేశ్ మిత్రులయ్యారు.
నాలుగేళ్లలో ముప్ఫై మంది
నాలుగేళ్లలో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ 30 మందిని కబళించింది. 2020 మే 29న అప్పటి సీఎం కేసీఆర్ ఈ రిజర్వాయర్‌ను ప్రారంభించగా.. మొదట్లో బండ్‌పైకి సందర్శకులను అనుమతించేవారు. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడడంతో.. రెండు ర్యాంపులను మూసివేసి, అనుమతిని నిరాకరించారు. దీంతో సందర్శకులు ర్యాంపుల మీదుగా కాకుండా.. కాలి నడకన బండ్‌పైకి వెళ్తున్నారు. ఇదే అదనుగా.. రిజర్వాయర్‌లోకి దిగడం, ఈతకొట్టడం, చేపలను పట్టడం, నీళ్లలో కాళ్లుపెట్టి కూర్చుని, ముచ్చట్లు పెట్టడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తు జారిపడి, ఈత రాక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆత్మహత్యలకు కూడా ఈ రిజర్వాయర్ అడ్డాగా మారుతోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు భద్రతను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఐదుగురు యువకులు మృతిచెందిన నేపథ్యంలో.. రిజర్వాయర్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ దిగ్ర్భాంతి
కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం సమాచారం అందినప్పటి నుంచి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో ఫోన్‌లో పరిస్థితిని సమీక్షించారు. సీఎం ఆదేశాలతో సిద్దిపేట పోలీసు కమిషనర్‌తోపాటు.. జిల్లా యంత్రాంగం అంతా ఘటనాస్థలికి చేరుకుని, గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి రిజర్వాయర్ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించారు.