Share News

Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:13 PM

తెలంగాణలో కులగణన మెుత్తం తప్పులతడకగా ఉందని, దాదాపు 40 లక్షల బీసీ జనాభా తగ్గించి లెక్కలు చూపారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకునే పక్కాగా సర్వే చేసినట్లు మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..
TPCC chief Mahesh kumar Goud

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. నిన్న (మంగళవారం) ప్రత్యేకంగా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించి మరీ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వాటిని ఆమోదించింది. అయితే బీసీ కులగణనపై ప్రతిపక్ష, స్వపక్ష నేతల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీసీ జనాభా తగ్గించి చూపే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కులగణన మెుత్తం తప్పులతడకగా ఉందని, దాదాపు 40 లక్షల బీసీ జనాభా తగ్గించి లెక్కలు చూపారంటూ మండిపడుతున్నారు. అయితే అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకునే పక్కాగా సర్వే చేసినట్లు మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎక్కడా వారిని తగ్గించి చూపలేదని, సర్వే పక్కాగా జరిగిందని అంటున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలకు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.


ఈ సందర్భంగా గాంధీ భవన్ వద్ద పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. "ఏ లెక్కల ఆధారంగా కులగణన తప్పని అంటున్నారో ప్రతిపక్షాలు చెప్పాలి. మీరు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపండి. రాజకీయ నాయకుల ఉచ్చులో బీసీ సంఘాలు, బీసీ నాయకులు పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలను అనగదొక్కిన పార్టీలు, నాయకుల మాటలు నమ్మి మోసపోకండి. బీసీ లెక్కలు తగ్గాయని మాట్లాడుతున్న వారికి ప్రామాణికం ఏంటి?. దేన్ని ఆధారం చేసుకుని వారు మాట్లాడుతున్నారు. తప్పుడు మాటలతో బీసీ ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. గత పదేళ్లలో బీసీలకు ఏం న్యాయం చేశారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి.


స్థానిక సంస్థల్లో బీసీల జనాభా తగ్గించింది బీఆర్ఎస్ కాదా?. ఎన్నో సంవత్సరాలుగా బీసీ కులగణన కోసం ఆ వర్గం నేతలు, ప్రజలు ఎదురుచూశారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేర్చింది. బీసీల ఆకాంక్ష నేరవేర్చామని ప్రతిపక్షాలకు కడుపుమంట. అడ్డగోలుగా కుటుంబంలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చే పార్టీ మాది కాదు. సమగ్ర కుటుంబ సర్వే మంచిదే అయితే దాన్ని ఎందుకు టేబుల్ చేయలేదో సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులూ ఎడారిలో ఉన్నాం. బిందెడు నీళ్లు దొరికితే వాటిని కాపాడుకోవాలి. గురువారం మా కుటుంబ(కాంగ్రెస్ పార్టీ) మీటింగ్ జరుగుతుంది. కులగణనపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అన్ని విషయాలూ అక్కడ మాట్లాడుకుంటాం. కాంగ్రెస్ నేతలు ఎంత చిన్నవారైనా, పెద్దవారైనా పార్టీ క్రమశిక్షణకి లోబడే ఉండాలి. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు. ఎవరైనా కులగణనకు ఇంకా వివరాలు ఇవ్వకపోతే ఇప్పటికైనా ఇవ్వండి" అని చెప్పారు.


మల్లన్నకు షోకాజ్ నోటీసులు..

కాగా, కులగణన సర్వేను ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కాల్చివేయడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మల్లన్న ఇచ్చే సమాధానం ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకోవాలా, వద్దా? నిర్ణయించనుంది. అయితే ప్రస్తుతం తీన్మార్ మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు. పార్టీలో ఉంటూనే సొంత ప్రభుత్వం చేసిన సర్వేను ఆయన వ్యతిరేకిస్తూ హాట్ టాపిక్‌గా మారారు. బీసీల జనాభాను తగ్గించి చూపారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మల్లన్న ఫైర్ అయ్యారు. ఈ మేరకు కులగణన సర్వే ప్రతులను ఆయన తగలబెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Mastan Sai: వీడు మాములోడు కాదు.. నగ్నంగా వీడియోలు తీసి ఏం చేశాడంటే.. మస్తాన్‌సాయి ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే నిజాలు

Hyderabad: సెల్లార్ తవ్వకాల్లో అపశృతి.. మట్టి దిబ్బలు కూలి ముగ్గురు మృతి

Updated Date - Feb 05 , 2025 | 04:25 PM

News Hub