Share News

KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?

ABN , Publish Date - Jan 03 , 2025 | 03:00 PM

KTR: రైతుల బంధును బొంద పెట్టే ప్రయత్నం చేస్తోందంటూ రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రూ.22 వేల కోట్ల దుర్వినియోగం అయిందనటం శుద్ధ తప్పు అని ఖండించారు. ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలో.. ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచించారు.

KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?
BRS Working President KTR

హైదరాబాద్, జనవరి 03: రైతు బంధు పథకం అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తు్న్న వైఖరిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతును శాసించే స్థాయికి సీఎం కేసీఆర్ తీసుకు వచ్చారని గుర్తు చేశారు. కానీ రైతులు యాచించే స్థితికి కాంగ్రెస్ నేతలు తీసుకు వచ్చారని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అంటూ రేవంత్ సర్కార్‌పై ఆయన నిప్పులు చెరిగారు. రైతుల మీద ప్రేమతో రైతు బంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఇంకా రైతు బంధు ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఈ కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారన్నారు.

ఇప్పుడేమో రైతులు ప్రమాణ పత్రం ఇవ్వాలంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. అయితే ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు... రేవంత్ ప్రభుత్వమేనంటూ ఆయన స్పష్టం చేశారు. ఎంత మందికి రుణ మాఫీ చేశారు.. బోనస్ ఎంత మందికి ఇచ్చారో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


రైతు బంధును బొంద పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 22 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందనటం శుద్ధ తప్పు అని ప్రభుత్వ పెద్దల ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలో.. ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచించారు. రైతు బంధు బాకీపై ఊరూరా పోస్టర్లు వేస్తామని ప్రకటించారు.


అయినా.. రూ. 22 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో చెప్పే దమ్ముందా? మీకు అంటూ కాంగ్రెస్ పెద్దలను బల్లగుద్ది మరి ప్రశ్నించారు. ఎంత మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారో చెప్పాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. శనివారం నుంచి పార్టీ నేతలందరూ క్షేత్ర స్థాయిలో రైతులను అప్రమత్తం చేయాలని బీఆర్ఎస్ కేడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. శనివారం జరిగే కేబినెట్‌లో రైతు భరోసాపై సరైన నిర్ణయం తీసుకోవాలంటూ రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 03:35 PM