CM Revanth Reddy: బీసీ సంఘాలు అలా చేయొద్దు..రేవంత్ కీలక సూచన
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:46 PM
CM Revanth Reddy: ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కుల గణన సర్వే నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కుల గణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. ఇందులో తాము భాగస్వాములవడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్: పూర్తి పారదర్శకంగా కులగణన సర్వేను పూర్తి చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీ సంఘాలతో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం చాలా పోరాటాలు జరిగాయన్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. 2004లో ఉషామెహ్రా కమిటీ వేసి సమస్య పరిష్కారానికి ఆనాడే కాంగ్రెస్ ప్రయత్నించిందని చెప్పారు. ఇన్నాళ్లకు తాను సీఎంగా ఉన్నప్పుడు.. సమస్య పరిష్కారం కావడం సంతోషకరమని సీఎం రేవంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటోందని ఉద్ఘాటించారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చిన గంటలోనే వర్గీకరణ అమలు చేస్తామని చెప్పామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ అనేక నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన..
ఉమ్మడి ఏపీకి దళిత సీఎంను చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. షమీమ్ అక్తర్ నివేదికను మార్చకుండా ఆమోదించామని గుర్తుచేశారు. 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా కమిషన్ విభజించిందని తెలిపారు. 59 కులాలు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎవరూ అడక్కముందే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీ కులగనన ఆలోచన వచ్చిందని అన్నారు.2011 తర్వాత ఇప్పటి వరకు కేంద్రం జనాభా లెక్కలు చేయలేదని అన్నారు.బీసీలు రాహుల్ గాంధీకి అభినందనలు తెలపాలని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల గణన సర్వే నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
చట్టబద్ధత కల్పించాలి..
ఆయనకు కృతజ్ఞత సభ పెట్టాలి. రాహుల్ గాంధీకి పది లక్షల మందితో కృతజ్ఞత సభ పెట్టండి. పరేడ్ గ్రౌండ్‌లో ఈ సభ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలని అన్నారు. ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుందని తెలిపారు. అందుకే రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే నిర్వహించుకున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఫిబ్రవరి 4వ తేదీకు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నామని అన్నారు. పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్‌లో కుల గణన సర్వే పూర్తి చేశామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి..
‘మొదటి విడతలో కుల గణన సర్వేలో పాల్గొనని వారి కోసం రెండో విడతలో అవకాశం కల్పించాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. ఈ కుల గణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం. దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు… జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది. కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాం. లెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది బీసీలే. ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తర్వాత అవసరాన్ని బట్టి సవరణలు చేసుకోవచ్చు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్‌లో పడకండి. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి. నేను మీకు మద్దతుగా నిలబడతా. గొర్రె కసాయిని నమ్మినట్లు బీసీ సంఘాలు పోయి సర్వేలోనే పాల్గొనని వారి మద్దతు అడుగుతున్నారు. సర్వే చేసింది మేము , జనాభా లెక్కలు తేల్చింది మేము. కొందరు వెళ్లి సర్వేను వ్యతిరేకించిన పార్టీల నేతలను కలుస్తున్నారు. సర్వేకు సహకరించని, సర్వేలో పాల్గొనని పార్టీలు మీకు మద్దతు ఇస్తాయా’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
దళితులకు అండగా ఉంటాం..
సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇదని చెప్పారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించిందని తెలిపారు. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిందని అన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేశాం..
‘మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి వన్‌మెన్ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. వన్‌మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
BRS MLC Kavitha: ఆ నివేదికను తక్షణమే బయటపెట్టాలి.. రేవంత్‌పై కవిత ప్రశ్నల వర్షం
Dana Nagender serious statement: నేను సీనియర్‌ను.. మీరు చెప్తే నేను వినాలా.. దానం ఫైర్
DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవ్వరినీ వదలం: డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest Telangana News And Telugu News