KTR: ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు..
ABN , Publish Date - Mar 23 , 2025 | 09:06 AM
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్షరాల 420 అబద్దపు హామీలు... నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గుణపం దింపిన ఇందిరమ్మ రాజ్యం.. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్.. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ చేశారంటూ ఆయన ఆరోపించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ‘‘ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు.. చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదు.. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు... నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యం చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్.. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ.. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు- పెట్టెలో ఓట్లు పడ్డాయ్- జేబులో నోట్లు పడ్డాయ్- ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం.. రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు.. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారు... నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అన్నారు.. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారు... నాడు ఓట్ల కోసం హామీలు .. నేడు ఎగవేత కోసం కొర్రీలు..’’అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read..:
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం..
నిధుల్లోనూ నష్టపోతాం..
కాగా నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గటం మాత్రమే కాదు.. ఆర్థికపరమైన అంశాల పరంగా, నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ జీడీపీకి 36 శాతం భాగస్వామ్యాన్ని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రప్రభుత్వ వివక్ష కొత్తేమీ కాదని, ఇటీవల ఈ వివక్ష, అన్యాయం మరింత పెరిగాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్నీ ఉత్తరాదికే పరిమితమవ్వడం ఇందుకు ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. వివక్షను పెంచేలా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువస్తోందన్నారు. ఇప్పటికే అన్యాయానికి గురైన దక్షిణాది రాష్ట్రాలకు ఇది పుండు మీద కారం రుద్దటమేనన్నారు.
సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం
‘దేశంలో ఏ రాష్ట్రమూ మరో రాష్ట్రం మీద ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఉండకూడదు. అదే సిసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇది కేవలం ఉత్తర దక్షిణ రాష్ట్రాల వ్యవహారం కాదు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ప్రాంతాలకు నష్టం చేకూర్చే అంశం. కేవలం జనాభా ఆధారంగా సీట్లు పెరిగితే సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మనమంతా భారతీయులం. అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉంది. విభిన్న భాషలు, సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశమే భారతదేశం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు’ అని కేటీఆర్ తెలిపారు. వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే అంశాన్ని తాము వ్యతిరేకించడం లేదని, నిధుల కేటాయింపులో వివక్షను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
నష్టంపై మాట్లాడకుంటే చరిత్ర క్షమించదు
దేశాభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణలో విఫలమయ్యాయని, అటువంటప్పుడు ఇప్పుడు డీలిమిటేషన్‌లో ఆ రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చటం ఏ విధంగా సరైందని ప్రశ్నించారు. దేశాన్ని వెనుకబాటుకు గురి చేసిన వారికి రివార్డు ఇవ్వడం లాంటిదే ఇదని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి, భారత్ సూపర్‌పవర్ కావాలంటే.. అభివృద్ధి సాధించిన రాష్ట్రాలను ప్రోత్సహించాలిగానీ శిక్షించటం కాదని హితవు పలికారు. పరిపాలనలో, ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నప్పటికీ, తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదన్నారు.
మందబలం ఆధారంగా ప్రజాస్వామ్యం నడవొద్దు
భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, అటువంటి దేశంలో ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదని కేటీఆర్ పేర్కొన్నారు. మందబలం నియంతృత్వానికి దారి తీస్తుందన్నారు. మెజారిటీ, మందబలం ఎటువంటి నియంతృత్వాన్ని సృష్టిస్తాయో.. 14 ఏళ్ల స్వరాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజలు కళ్లారా చూశారన్నారు. ఢిల్లీలో వున్న మందబలంతో పాటు నాటి సమైక్య రాష్ట్రంలోని మెజారిటీ నాయకత్వంపైనా.. కేసీఆర్ నాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్పమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలను స్ఫూర్తిగా తీసుకుంటామని, అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు తమకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. తమ హక్కులు సాధించుకోవడానికి దేశంలోని రాష్ట్రాలకు.. తమిళనాడు ద్రవిడ ఉద్యమం ఒక దిక్సూచిలా పని చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాడు ఎన్టీఆర్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్
హైదరాబాద్‌లో డీలిమిటేషన్ సమావేశం..
For More AP News and Telugu News