Share News

Seethakka criticizes Bandi Sanjay: బండి సంజయ్‌ వ్యాఖ్యలు.. సీతక్క మాస్ వార్నింగ్

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:22 PM

Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి బండి సంజయ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి.

Seethakka criticizes Bandi Sanjay: బండి సంజయ్‌ వ్యాఖ్యలు.. సీతక్క మాస్ వార్నింగ్
Minister Seethakka

హైదరాబాద్, ఫిబ్రవరి 25: బీజేపీ టీం ఇండియా, కాంగ్రెస్ పాకిస్తాన్ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నారని ఆగ్రహించారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదని.. సబ్జెక్టు అంతకన్నా లేదన్నారు. అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట తెలియదని విరుచుకుపడ్డారు.


‘‘సూటిగా బండి సంజయ్‌ను అడుగుతున్నా... పట్టభద్రులకు మీరేం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత ఉపాధి కల్పించారు? ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మారు. ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ... దేవునికి వినియోగించే అగర్బత్తిల మీద కూడా జీఎస్టీ వేసింది. ఉన్నత విద్య మీద 18% జీఎస్టీ విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది. అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదు. ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు. బండి సంజయ్.. పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది లేదు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రండి’’ అంటూ సవాల్ విసిరారు.


ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలుపెట్టలేనీ అసమర్థ కేంద్ర ప్రభుత్వం అంటూ విమర్శించారు. బండి సంజయ్‌కు చెప్పుకోవడానికి ఏం లేదని.. మాట్లాడడానికి రెండు మాటలు రావన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే.. భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్ధంలో పాల్గొనాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆకలి చావులు అంతర్గత సమస్యలతో దివాలా తీసిన పాకిస్తాన్‌తో పోల్చి.. దేశాన్ని అవమానపర్చవద్దన్నారు. పాకిస్తాన్‌తో భారతదేశాన్ని పోల్చి దేశ గౌరవాన్ని బండి సంజయ్ తగ్గిస్తున్నారని.. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలని డిమాండ్ చేశారు.


‘‘భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన భారతీయులంతా నా సోదరులే అన్న మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాల అవసరమా. మీరు చేసింది శూన్యం. పట్టభద్రులారా ఆలోచించండి విద్యా వేత్త నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి. సంవత్సరకాలంలో 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నరేందర్ రెడ్డిని గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి. భావోద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్‌కు, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పండి’’ అంటూ పిలుపునిచ్చారు.


యువతను మత కొట్లాట వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందే అని అన్నారు. జటిలమైనా ఎన్నో సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. భారతదేశంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం మానుకోవాలని.. ఈ చిల్లర మాటలు మానేయాలని హితవుపలికారు. ఇలాంటి విద్వేషాపూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ పాకిస్తాన్‌తో భారతదేశాన్ని పోల్చి దేశ గౌరవాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకోవాలని మంత్రి సతీక్క వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన లోకేష్

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. ఆప్‌కు భారీ షాక్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 03:22 PM