Jagga Reddy: అంజన్న వ్యాఖ్యలపై స్పందించిన జగ్గారెడ్డి
ABN , Publish Date - Feb 25 , 2025 | 07:52 PM
Jagga Reddy: అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నేతల వ్యవహార శైలిపై టీపీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
హైదారబాద్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీలో అగ్రస్థానంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలపై సికింద్రాబాద్ మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని ఇతర కులాలకు చెందిన నాయకులు.. రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోకండని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ అన్నారు. రెడ్డి సామాజిక వర్గంపై.. ఇతర కులాలకు చెందిన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలను మన తోటి సోదరులు చేసిన వ్యాఖ్యలుగానే భావించాలని వారికి హితవు పలికారు.
రెడ్డి సామాజిక వర్గం అన్ని కులాలు, మతాలకు సంబంధించిన వాళ్ళతో సఖ్యంగా, స్నేహంగా కలిసి మెలిసి జీవనం సాగించే సామాజిక వర్గమని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అభివర్ణించారు. ఎటువంటి కష్టం కానీ.. సమస్య కానీ వచ్చినా వారిని కలిసి.. వారి కష్టాలు, సమస్యలు తీర్చడమే రెడ్డి సామాజిక వర్గం లక్షణమని ఆయన పేర్కొన్నారు.
అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఆ సామాజిక వర్గంపై ప్రజలు ఇంత ప్రేమ, ఆప్యాయతను చూపిస్తున్నారని వివరించారు. కొంతమంది చేసిన వ్యాఖ్యలకు బాధపడి, వారిని తప్పుగా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేక భావన కలిగి ఉండవలసిన అవసరం లేదని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి మధ్యలో వచ్చిన కొంత మంది ఇతర కులాలకు చెందిన నేతలు.. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఇతర కులాలకు సంబంధించిన కొంతమంది నాయకులు.. ఇటీవల మాట్లాడిన మాటలు మాత్రం కేవలం ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలే తప్పా, మన సామాజిక వర్గంపై వ్యతిరేకతతోనో.. మరో రకంగానో మాట్లాడిన మాటలు కాదని గుర్తించాలంటూ రెడ్డి సామాజిక వర్గం నేతలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం తెలంగాణలో నాయకత్వ స్థానంలో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతల తీరును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ విలేకర్ల సమావేశంలో ఎండగట్టారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినందుకే తెలంగాణలో కుల గణన సర్వేను రేవంత్ సర్కార్ నిర్వహించిందని తెలిపారు. లేకుంటే వీళ్లు ఈ సర్వేనే చేసే వారు కాదని కుండ బద్దలు కొట్టారు. పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి బిహార్ మాజీ సీఎం లూలూ ప్రసాద్ యాదవ్ చెప్పినందుకే తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కిందన్నారు.
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
తనకు ఈ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్డు తగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కేంద్ర మంత్రి కాకుండా వీళ్లే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయే సమయంలో తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని.. గెలిచే టైంలో మాత్రం తనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎంపీగా పోటీ చేస్తారని.. మరి జీవన్ రెడ్డి ఓడిపోయాడని.. ఆయనకు ఎంపీగా టిక్కెట్ మళ్లీ ఎందుకు ఇచ్చారని పార్టీలోని సీనియర్లను ఆయన ప్రశ్నించారు. పక్క పార్టీలోని దానం నాగేందర్‌ను తీసుకు వచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భజన సంఘాలు వచ్చాయన్నారు. తమకు ప్రాధాన్యత లేకుంటే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా రేవంత్ సారథ్యంలోని పార్టీలోని కీలక నేతలను అంజన్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పైవిధంగా స్పందించారు.
For Telangana News And Telugu News