Illegal Constructions: బరి తెగింపు!
ABN , Publish Date - Jan 04 , 2025 | 03:57 AM
అక్రమ కట్డడాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా, అనుమతుల్లేని నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నా.. ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారు ఏమాత్రం వెనకాడటంలేదు.
అనుమతుల్లేకుండా 9 అంతస్తుల భవనం
అయ్యప్ప సొసైటీ వంద అడుగుల రోడ్డులో
పాలమూరు గ్రిల్స్ పక్కన అక్రమ నిర్మాణం
జీహెచ్‌ఎంసీ నిబంధనల్ని పట్టించుకోని బిల్డర్
అధికారులు హెచ్చరించినా లెక్కచేయని తీరు
కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు
అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నా..
హైదరాబాద్‌లో పలు అనుమతుల్లేని కట్టడాలు
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అక్రమ కట్డడాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా, అనుమతుల్లేని నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నా.. ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారు ఏమాత్రం వెనకాడటంలేదు. పురపాలక శాఖ అధికారుల హెచ్చరికలనే కాకుండా.. న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్కచేయకుండా బరితెగించి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. అయ్యప్ప సొసైటీ వంద అడుగుల రోడ్డులో ఎటువంటి అనుమతులు లేకుండా ఏకంగా 9 అంతస్తుల భవనాన్ని అడ్డగోలుగా కట్టేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్‌కు ఆనుకుని ఉన్న సర్వే నంబరు 11/5, ప్లాట్ నంబరు 5/13లో 684 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు పొందకుండా, కనీసం అడుగు కూడా సెట్‌బ్యాక్స్ వదలకుండా ఈ నిర్మాణం జరుగుతోంది. ఈ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు.. కట్టడాన్ని కూల్చివేయాలంటూ 2024 ఫిబ్రవరి 14న భవన నిర్మాణదారుకు నోటీసు ఇచ్చారు. నోటీసు అందుకున్న నాటి నుంచి 15 రోజుల వ్యవధిలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయినా నిర్మాణదారు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఫిబ్రవరి 26న తిరిగి 15 రోజుల వ్యవధిలో భవనం కూల్చివేయాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అయినా నిర్మాణదారు లెక్కచేయలేదు. దీంతో వంద అడుగుల రోడ్డులో అండర్‌పా్‌సకు ఎదురుగా జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు కూడా భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించింది.
మూడు నెలలు ఆపి.. మళ్లీ నిర్మాణం
న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, పట్టణ ప్రణాళిక అధికారులు భవనం వద్దకు వెళ్లి స్లాబ్‌కు రంధ్రాలు పెట్టి.. కూల్చివేయాలని నిర్మాణదారును హెచ్చరించి వచ్చేశారు. ఆ సమయంలో మూడు నెలలపాటు తాత్కాలికంగా పనులు ఆపేసిన నిర్మాణదారు.. ఆ తరువాత మళ్లీ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం రెండు అంతస్తుల సెల్లార్‌తో కలిపి ఏడు అంతస్తుల భవనం నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న రొనాల్డ్‌రోస్ ఈ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో ఆయన పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం రొనాల్డ్‌రోస్ స్థానంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమితులైన ఆమ్రపాలి.. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని సిటీ చీఫ్‌ప్లానర్ (సీసీపీ)ను ఆదేశించారు. అయినా వారి హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయకుండా భవన నిర్మాణ పనులు కొనసాగించారు. ఆ తరువాత ఆమ్రపాలి ఏపీకి వెళ్లిపోగా.. కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి నియమితులయ్యారు. కానీ, భవన నిర్మాణం మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. నిబంధనల ప్రకారం 5 అంతస్తుల భవన నిర్మాణం చేయడానికి 100 అడుగుల రోడ్డుకు ముందువైపు 18 అడుగులు, భవనం మిగిలిన మూడు వైపులా 13 అడుగుల చొప్పున సెట్ బ్యాక్స్ వదలాలి. కానీ, ఒక్క అడుగు కూడా వదలకుండా ఉన్న స్థలమంతా నిర్మాణం చేపట్టారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన మునిసిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటుండడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులే ఇవ్వకూడని చోట 9 అంతస్తుల అక్రమ నిర్మాణం జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు.
నగరంలో ఇలాంటివి ఎన్నెన్నో!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనధికారిక కట్టడాలు అనేకం ఉన్నాయి. మాదాపూర్, హఫీజ్‌పేట్, మణికొండ, అత్తాపూర్, తెల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. పట్టణ ప్రణాళిక అధికారులకు సమాచారం ఇచ్చినా.. కొన్నింటిని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఆమ్యామ్యాలకు, ప్రలోభాలకు తలొగ్గి రాజీ పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో నిర్మాణదారుల అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది. హైడ్రా ఏర్పాటైన తరువాత ఇలాంటి నిర్మాణాల విషయంలో కొంత ఆందోళన మొదలైనా.. చాలా చోట్ల గుట్టుచప్పుడు కాకుండా ఈ తరహా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి.