Share News

Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:41 AM

రాజకీయాల జోలికి వెళ్లకుండా ప్రాణహిత-చేవెళ్ల కాదని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి కారణాలను మాత్రమే వివరించాలని జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఐడీసీ) మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ నేత వి.ప్రకాశ్‌రావుకు సూచించింది.

Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

  • టీఎ్‌సఐడీసీ మాజీ చైర్మన్‌ ప్రకాశ్‌రావుకు కాళేశ్వరం కమిషన్‌ హితవు

  • తెలంగాణ ఏర్పడింది నీటి వాటాల కోసమే!: కమిషన్‌తో ప్రకాశ్‌రావు కోదండరాం, వెదిరె శ్రీరామ్‌, రఘు అబద్ధాలు చెప్పారని వ్యాఖ్య

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల జోలికి వెళ్లకుండా ప్రాణహిత-చేవెళ్ల కాదని, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడానికి కారణాలను మాత్రమే వివరించాలని జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఐడీసీ) మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ నేత వి.ప్రకాశ్‌రావుకు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణలో భాగంగా కమిషన్‌ బుధవారం ఆయన్ను విచారించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడానికి కారణాలేంటని అడగ్గా.. నీటి వాటాల కోసమే రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ప్రకాశ్‌ చెప్పబోయారు. స్పందించిన కమిషన్‌.. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా, ప్రాజెక్టు వివరాలు మాత్రమే చెప్పాలని స్పష్టం చేసింది. ఎగువన గోదావరి ప్రధాన పాయపై మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నో జలాశయాలు నిర్మించి, వందల టీఎంసీలను తరలించుకుంటుండడంతో గత 50 ఏళ్లుగా తెలంగాణకు వచ్చే ప్రవాహాలు తగ్గిపోయాయని తెలిపారు. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ నిర్మాణాన్ని తరలించడాన్ని సమర్థిస్తూ ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘రికార్డుల్లో ఏం ఉందో అదే అంతిమం.


దాన్నెవరూ మార్చలేరు’ అని కమిషన్‌ స్పష్టం చేసింది. దీంతో తుమ్మిడిహెట్టి వద్ద తెలంగాణ అవసరాలు తీర్చేంత నీటి లభ్యత లేదని గుర్తించి, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టారని ప్రకాశ్‌ చెప్పారు. తెలంగాణలో 13 జిల్లాల కోసం 200 టీఎంసీల నీటి అవసరాలు ఉండేవని తెలిపారు. అయితే, తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించడమే ఉత్తమమని విశ్రాంత ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీ 2015 ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయాన్ని కమిషన్‌ గుర్తుచేసింది. ప్రతిపాదిత మేడిగడ్డ బ్యారేజీ అనవసరమని కమిటీ చెప్పిందనీ పేర్కొంది. దీనికి ప్రకాశ్‌ సమాధానమిచ్చేందుకు ప్రయత్నించగా, టీఎ్‌సఐడీసీ చైర్మన్‌గా నియమితులయ్యే నాటికే ఈ కమిటీ ఏర్పడినందున, మీ సమాధానం అక్కర్లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. చాలా మంది కమిషన్‌ ముందు హాజరై తప్పుడు సమాచారం ఇచ్చారని, కమిటీ కూడా 105 మీటర్ల ఎత్తుతో మేడిగడ్డ కట్టాలని సిఫారసు చేయగా.. ముంపు ఉంటుందని నాటి ప్రభుత్వం 100 మీటర్లకే పరిమితం చేసిందని ప్రకాశ్‌ తెలిపారు.


మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌ను ఏం చేస్తే బాగుంటుందని కమిషన్‌ ప్రశ్నించగా.. మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని, అది సాధ్యం అవుతుందని చెప్పారు. ఇంకా చెప్పబోతుండగా.. కమిషన్‌ కల్పించుకొని ‘టెక్నికల్‌ అంశాలతో మీకు సంబంధం లేదు. ఇంజనీర్లకు వదిలేయండి’ అని సూచించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటి లభ్యతతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్‌, జేఏసీ నేత రఘు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి గ్రావిటీ ప్రాజెక్టు కాదని, ఆ ప్రాజెక్టులోనూ రెండుచోట్ల నీటిని పంపింగ్‌ చేయాల్సి ఉంటుందని, మేడిగడ్డలో మూడుచోట్ల పంపింగ్‌ అవసరమని చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిపుణుల కమిటీపై సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. మేఘా సంస్థ కమీషన్ల కోసమే అదనపు టీఎంసీ పనులు చేశారనడం సరికాదని చెప్పారు. గురువారం సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థ ‘నవయుగ ఇంజనీరింగ్‌’ ప్రతినిధులను కమిషన్‌ ప్రశ్నించనుంది.


ఇవి కూడా చదవండి..

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

Updated Date - Jan 23 , 2025 | 04:41 AM