Share News

Mahesh Kumar Goud: కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:07 AM

ఇక కేటీఆర్‌ పని అయిపోయిందని.. జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

Mahesh Kumar Goud: కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం

  • బీఆర్‌ఎస్‌ శకం ముగిసింది

  • సంక్రాంతి తర్వాత నామినేటెడ్‌ పదవులు: మహేశ్‌గౌడ్‌

  • కేటీఆర్‌ను ఏసీబీ పిలుస్తోందనే రైతుల జపం: సీతక్క

ఆదిలాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఇక కేటీఆర్‌ పని అయిపోయిందని.. జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. తొలుత జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పిన ఆయన మళ్లీ పనికి రాని కేసు అన్నారని.. ఏసీబీ నోటీసులు, గవర్నర్‌ అనుమతి ఇవ్వగానే కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్లమెంట్‌ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలోనూ ప్రసంగించారు. ఇక బీఆర్‌ఎస్‌ రాజకీయ శకం ముగిసిందని.. ఆ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. బీజేపీ చరిత్రను తిరగ రాయడంతో పాటు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పార్టీనే నమ్ముకుని పని చేసిన కార్యకర్తలు, నేతలకు ప్రాధాన్యతనిచ్చి సంక్రాంతి తర్వాత అన్ని నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు.


ప్రతి నియోజక వర్గానికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవులను కేటాయిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90శాతానికి పైగా స్థానాల్లో గెలవాలన్నారు. ఎమ్మెల్సీ కవిత ఏం ముఖం పెట్టుకుని జిల్లాల్లో పర్యటిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కుటుంబం కల్లిబొల్లి మాటలు చెబుతూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. వరంగల్‌ తర్వాత ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. కేటీఆర్‌ను ఏసీబీ పిలుస్తోంది కాబట్టే బీఆర్‌ఎస్‌ నేతలు రైతుల జపం చేస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి బీసీలు, రైతులు కనిపించలేదా అని నిలదీశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కొందరు సహకరించకపోవడంతోనే ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గ స్థాయి నేతలు అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని సూచించారు. నామినేటెడ్‌ పదవుల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు.


గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: దీపాదాస్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా కనిపించడం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలంతా గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కాంగ్రె్‌సకు శక్తిమంతమైన కార్యకర్తలు ఉన్నారని, ఐక్యమత్యంగా పనిచేస్తే కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

Updated Date - Jan 07 , 2025 | 05:07 AM