Telangana Cabinet: నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:40 AM
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 4గంటలకు సచివాలయంలోని క్యాబినెట్ హాలులో జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.
రైతు భరోసా అమలుపైనే ప్రధానంగా చర్చ!
రేషన్ కార్డుల జారీ, రైతు కూలీలకు 12వేల సాయంపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 4గంటలకు సచివాలయంలోని క్యాబినెట్ హాలులో జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు చేసింది. పంట వేసిన ప్రతి రైతుకూ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకోసం రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ఈ అంశాలన్నింటిపై శనివారం జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు.
మరో ప్రధాన అంశంమైన రేషన్ కార్డుల జారీపైనా క్యాబినెట్ చర్చించనుంది. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిని ఎప్పటి నుంచి జారీ చేయాలనే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీలలో ఇది కూడా ప్రధానమైన అంశం. దీనిని అమలు చేయాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం.. క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నివేదిక, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరి గుట్టకు కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.