Bhadradri: అధ్యాపకుల ఒత్తిడి తట్టుకోలేక విదార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:42 AM
ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 464 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిని విద్యార్థి రెండో ఏడాదిలో మరిన్ని మా ర్కుల కోసం అధ్యాపకులు పెడుతున్న ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చుంచుపల్లి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 464 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిని విద్యార్థి రెండో ఏడాదిలో మరిన్ని మా ర్కుల కోసం అధ్యాపకులు పెడుతున్న ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన శనగ రామ్‌పవార్ (18) అనే విద్యార్థి లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి ఏడాదిలో 464 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిన అతడు ఇటీవల కళాశాలలో నిర్వహించిన వారాంతపు పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించాడు. దాంతో అధ్యాపకులు అతడిని మందలించి, తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు.
ఇలా మరోసారి జరిగితే ప్రతిభావంతుల సెక్షన్ నుంచి తీసేసి వేరే సెక్షన్‌లో వేస్తామని హెచ్చరించారు. దాంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రామ్‌పవార్ పది రోజులుగా కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. అయితే అధ్యాపకులు కళాశాలకు రావాలని విద్యార్థికి, అతడి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. లేనిపక్షంలో వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్ ఇవ్వబోమని భయపెట్టారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి రామ్‌పవార్ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు.