Share News

Tummala: సాగు భూమికి రైతు భరోసా ఇస్తామంటే ఎందుకు కడుపు మంట?

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:29 AM

సాగు భూములకు రైతుభరోసా ఇస్తామంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఎందుకు కడుపు మండుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.

Tummala: సాగు భూమికి రైతు భరోసా ఇస్తామంటే ఎందుకు కడుపు మంట?

  • రైతు భరోసాకు ఎలాంటి కోతలు పెట్టడం లేదు

  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): సాగు భూములకు రైతుభరోసా ఇస్తామంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఎందుకు కడుపు మండుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. కొన్ని పత్రికలు, కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేసినట్లుగా రైతుభరోసా అమలుకు ఎలాంటి కోతలు పెట్టడంలేదని, ప్రభుత్వ ప్రకటన చూసి మింగలేక, కక్కలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఓ ప్రకటనలో విమర్శించారు. మొదటి పంటకాలంలోనే 25,35,963 మంది రైతులకు రూ.20,617 కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నే వేలెత్తి చూపుతారా? అని ఆయన ధ్వజమెత్తారు. రైతుకూలీలకు రూ.12 వేలు ప్రకటించడం ద్వారా ప్రభుత్వం అన్నివర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోందన్నారు. మొదటి ఏడాదిలో ఉచిత విద్యుత్‌కు రూ.10,444 కోట్లు, పంటల కొనుగోళ్లకు రూ.12,413 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని, రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.28,833 కోట్ల నగదు బదిలీ చేసినట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఇతర పథకాలకు రూ.1,965 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని సక్రమంగా అమలుచేయని విషయం రాష్ట్ర రైతులందరికీ తెలుసన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ ఊసెత్తటంలేదన్నారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలోనే 35 శాతం నిధులను వ్యవసాయరంగానికి కేటాయించింది. రైతు సంక్షేమానికి ఏడాదిలో రూ.63,808 కోట్లు ఖర్చు చేసింది. 41.03 లక్షల మంది రైతులకు రూ.1433.33 కోట్లతో రైతు బీమా పథకం అమలుచేస్తోంది. సన్నాలకు రూ.500 బోనస్‌ ఇస్తోంది. ఇప్పటివరకు రైతులకు రూ.1,108 కోట్లు చెల్లించింది. సోయాబీన్‌ సేకరణలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. ముడి పామాయిల్‌ దిగుమతిపై సుంకాన్ని పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయడంతో గెలల ధర రూ.14,392 నుంచి రూ.20,413కు పెరిగింది’ అని తుమ్మల తెలిపారు. అతి త్వరలో రంగారెడ్డి జిల్లా రైతులకేకాకుండా రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో రూ.2,000 కోట్లతో కోహెడలో పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని తుమ్మల వెల్లడించారు.

Updated Date - Jan 07 , 2025 | 04:29 AM