భారతదేశంలోని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఒకటి. ఏపీ శాసనసభకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లవచ్చు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల నుంచి 175 మంది ప్రతినిధులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిని సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఓటర్లు ఎన్నిక చేస్తారు. చట్టాల రూపకల్పన, పాలనా పర్యవేక్షణ, బడ్జెట్ ఆమోదం వంటి ఎన్నో ముఖ్యమైన పనులు అసెంబ్లీ వేదికగా జరుగుతాయి. శాసనసభకు ఏటా వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర శాసనసభ ఏర్పడింది.140 మంది ఆంధ్ర రాష్ట్ర సభ్యులు, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయడం ద్వారా 1 నవంబర్ 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ, 105 మంది సభ్యులతో కలిపి ఆంధ్రప్రదేశ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ ఏర్పాటైంది. అసెంబ్లీ మొదటి సమావేశం 3 డిసెంబర్ 1956న జరిగింది.
1958 జూలై 1న శాసన మండలి ఏర్పడింది. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు 175 శాసనసభ స్థానాలు కేటాయించగా మిగిలిన 119 తెలంగాణకు పరిమితమయ్యాయి. 2019 ఏప్రిల్ 11న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైసీపీ 151 స్థానాలు గెలుచుకోగా, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన పార్టీ ఒక సీటు గెలుచుకుంది.