ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యమైన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం హోరెత్తుతోంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మిగతా పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ఉండనుంది. వివిధ పార్టీల అధ్యక్షులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమైన అభ్యర్థులు ఎవరో ఓసారి తెలుసుకుందాం.
టీడీపీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా, మాజీ మంత్రి నారాయణ నెల్లూరు శాసనసభ స్థానం నుంచి, సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
వైసీపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నుంచి, రోజా నగరి నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి, బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి, మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
బీజేపీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి, సీనియర్ నేత సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్: పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రులు పల్లంరాజు కాకినాడ నుంచి, జేడీ శీలం బాపట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
జనసేన పార్టీ: జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ 21 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.