Atchannaidu: ముద్దులు పెట్టుకోవడం.. తలరుద్దడాలుండవు

ABN , First Publish Date - 2022-12-28T12:27:20+05:30 IST

నారా లోకేష్ పాదయాత్రలో ముద్దులు పెట్టుకోవడం.. షాంపులతో తలరుద్దడం వంటి సీన్లు కనిపించవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Atchannaidu: ముద్దులు పెట్టుకోవడం.. తలరుద్దడాలుండవు
ముద్దులు పెట్టుకోవడం.. తలరుద్దడాలుండవు

అమరావతి: నారా లోకేష్ పాదయాత్రలో ముద్దులు పెట్టుకోవడం.. షాంపులతో తలరుద్దడం వంటి సీన్లు కనిపించవని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) స్పష్టం చేశారు. యువ గళం (Yuva Galam) పేరుతో చేపట్టనున్న లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)కు సంబంధించిన లోగోతో పాటు యువగళం జెండాను ఆ పార్టీ సీనియర్ నేతలు కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ పాదయాత్ర తరహాలో లోకేష్ పాదయాత్ర ఆడంబరంగా ఉండదని తేల్చిచెప్పారు. యువతకు అండగా ఉండేందుకు లోకేష్ పాదయాత్రకు యువగళం పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. 2023, జనవరి 27వ తేదీన లోకేష్ పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్రకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు అత్యాచారాలకు బలి అవుతున్నారని.. యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పరిశ్రమలు రావడం లేదు.. ఉపాధి ఉండడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం.. నోటిఫికేషన్లు ఇవ్వలేమన్నారు. కానీ నిరుద్యోగ యువతకు అండగా ఉంటూ భరోసా కల్పించేందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. 9686296862కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చిన్న రాజప్ప, వంగలపూడి అనిత, నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

lok.gif

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కూడా 2014 ఎన్నికలకు ముందు ‘వస్తున్నా ... మీ కోసం’ అంటూ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో నారా లోకేష్ కూడా 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2023, జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఏడాదికి పైగా యాత్ర ద్వారా ప్రజల్లోనే ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ వేసుకున్నారు. పార్టీ నేతలతో పాటు యువత ఎక్కువగా పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో 50 శాతం యువతకే ప్రాధాన్యత ఉంటుందని పార్టీ అధినేత వెల్లడించిన నేపథ్యంలో ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. ప్రధానంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడమే కాకుండా ఎన్నికలకు కూడా సిద్ధమయ్యేలా లోకేష్ పాదయాత్ర ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

at.gif

at-2.gif

lokesh.gif

Updated Date - 2022-12-28T13:00:01+05:30 IST