Maharashtra : ఏక్‌నాథ్ షిండే సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2022-12-28T19:51:41+05:30 IST
కర్ణాటక-మహారాష్ట్ర (Maharashtra and Karnataka) సరిహద్దు వివాదం ముదురుపాకన పడిన వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ముంబై : కర్ణాటక-మహారాష్ట్ర (Maharashtra and Karnataka) సరిహద్దు వివాదం ముదురుపాకన పడిన వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) కరాఖండీగా ఓ విషయం స్పష్టం చేశారు. తమ భూభాగంలో కనీసం ఒక అంగుళం మేరకు అయినా వదిలిపెట్టేది లేదని, అవసరమైతే సుప్రీంకోర్టును, కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించిన తీర్మానాన్ని మహారాష్ట్ర శాసన సభ మంగళవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో మరాఠీ మాట్లాడేవారుగల 865 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని ఈ తీర్మానం కోరుతోంది.
మహారాష్ట్ర శాసన మండలిని ఉద్దేశించి షిండే బుధవారం మాట్లాడుతూ, తమను కర్ణాటక సవాల్ చేయరాదన్నారు. బెల్గాం, నిపణి, కర్వార్, బీదర్, భల్కి సహా 865 గ్రామాల్లోని అంగుళం భూమినైనా తాము వదులుకునేది లేదన్నారు. మరాఠీ మాట్లాడేవారికి అన్యాయం జరగకుండా నిరోధించడం కోసం చట్టబద్ధమైన విధానంలో తాము చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును కోరుతామని చెప్పారు.
శాసన సభ ఆమోదించిన తీర్మానం ప్రకారం, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న మరాఠీ ప్రజలకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఈ ప్రాంతాలు మహారాష్ట్రలో విలీనమయ్యేందుకు సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయిస్తుంది.
ఈ వివాదంపై కర్ణాటక (Karnataka) శాసన సభ కూడా ఇటీవల ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన సరిహద్దు వివాదాన్ని ఖండించింది. కర్ణాటక భూమి, నీరు, భాష, కన్నడిగుల ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కర్ణాటక ప్రజలు, ఎమ్మెల్యేల భావాలు ఒకటేనని పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ఐకమత్యంగా రాజ్యాంగపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో...
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన 1957 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. గత కాలపు బోంబే ప్రెసిడెన్సీలోని బెళగావిని తమకు ఇచ్చేయాలని మహారాష్ట్ర (Maharashtra) కోరుతోంది. ఇది ఇప్పుడు కర్ణాటకలో ఉంది. ఈ ప్రాంతంలో మరాఠీ భాష మాట్లాడేవారు ఉన్న గ్రామాలను తమకు ఇవ్వాలని మహారాష్ట్ర కోరుతోంది. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరిగిందని, మహాజన్ కమిషన్ నివేదిక అంతిమమైనదని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది. మహాజన్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 1966 అక్టోబరులో ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర-కర్ణాటక-కేరళ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు దీనిని ఏర్పాటు చేసింది.