Shiv Sena : సంజయ్ రౌత్ సంచలన నిర్ణయం... మోదీ, అమిత్ షాలతో త్వరలో భేటీ...

ABN , First Publish Date - 2022-11-10T13:44:47+05:30 IST

ద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర

Shiv Sena : సంజయ్ రౌత్ సంచలన నిర్ణయం... మోదీ, అమిత్ షాలతో త్వరలో భేటీ...
Sanjay Raut

ముంబై : ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)లను కలవబోతున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సబర్బన్ గోరేగావ్‌లో, పట్రా చావల్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి, మనీలాండరింగ్ జరిగినట్లు నమోదైన కేసులో సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ఆయన దాదాపు 100 రోజులపాటు జైలు జీవితం గడిపారు. ముంబైలోని స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టు ఆయనకు బుధవారం బెయిలు మంజూరు చేసింది.

జైలు నుంచి విడుదలైన సంజయ్ రౌత్ చాలా నీరసంగా కనిపించారు. ముంబైలోని బందూప్ ప్రాంతంలో ఉన్న తన నివాసం వెలుపల గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను జైలులో ఉన్నపుడు తన కుటుంబం చాలా బాధపడిందని ఆయన చెప్పారు. జైలులో గడపటం అంత సులువేమీ కాదన్నారు. జైలులో చాలా ఎత్తయిన గోడలు ఉంటాయని, కొన్నిసార్లు కొందరు వాటితోనే మాట్లాడుకుంటారని అన్నారు. సావర్కర్ పదేళ్ళపాటు జైలు జీవితం ఎలా గడిపారోనని తాను తరచూ అనుకునేవాడినన్నారు. బాలగంగాధర్ తిలక్, అటల్ బిహారీ వాజ్‌పాయి వంటి నాయకులు జైలులో ఎలా గడిపేవారోనన్నారు. అయితే తన కుటుంబం దీనినంతటినీ భరించవలసి వచ్చిందన్నారు. తన అరెస్టుకు కారణం రాజకీయ కక్ష సాధింపేనని మరోసారి ఆరోపించారు. జైలులో తాను నెలల తరబడి పరీక్షా కాలాన్ని ఎదుర్కొన్నానని, ఇందుకు తాను కేంద్ర దర్యాప్తు సంస్థలను నిందించబోనని చెప్పారు.

తాను తమ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), ఎన్‌‌సీపీ అధినేత శరద్ పవార్‌ (Sharad Pawar)లను గురువారం కలుస్తానని సంజయ్ రౌత్ చెప్పారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis)ను నాలుగు రోజుల్లోగా కలుస్తానని చెప్పారు. ప్రజలకు సంబంధించిన పనుల కోసం ఫడ్నవీస్‌ను కలవబోతున్నానని తెలిపారు. అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కూడా కలవబోతున్నానని తెలిపారు.

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందని, తాను వాటిని వ్యతిరేకించబోనని, కేవలం వ్యతిరేకించాలనే లక్ష్యంతో వ్యతిరేకించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నడుపుతున్నారని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆయన కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని తాను స్వాగతిస్తానని చెప్పారు. అయితే బీజేపీపై తన వ్యతిరేకత కొనసాగుతుందన్నారు. రాజకీయాల స్థాయి రాన్రానూ తగ్గిపోతోందన్నారు.

‘‘మీ మాటలు, చేతలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి’’ అని విలేకర్లు అడిగినపుడు సంజయ్ రౌత్ బదులిస్తూ, తాను పార్లమెంటు సభ్యుడినని, తన సోదరుడు ఎమ్మెల్యే అని చెప్పారు. నేతలను కలిసే హక్కు తనకు ఉందన్నారు. కేంద్ర హోం మంత్రి యావత్తు దేశానికి హోం మంత్రి అని, కేవలం ఓ పార్టీకి కాదని చెప్పారు.

Updated Date - 2022-11-10T13:48:23+05:30 IST