Bharat Jodo yatra: రాహుల్ పాదయాత్రలో భద్రతా వైఫల్యంపై అమిత్‌షాకు కాంగ్రెస్ లేఖ

ABN , First Publish Date - 2022-12-28T15:47:50+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో జనాలను అదుపు చేయడంలో పోలీసుల..

Bharat Jodo yatra: రాహుల్ పాదయాత్రలో భద్రతా వైఫల్యంపై అమిత్‌షాకు కాంగ్రెస్ లేఖ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో జనాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా వైఫల్యం (Security breach)పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు (Amit sha) లేఖ రాసింది. రాహుల్ గాంధీకి, భారత్ యాత్రలో పాల్గొంటున్న వారికి, నేతలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీ పోలీసులు నేరుగా హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు.

బదర్‌పూర్ సరిహద్దు నుంచి డిసెంబర్ 24న రాహుల్ గాంధీ వెంట వేలాది మంది మద్దతుదారులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎర్రకోట వైపు పాదయాత్ర సాగుతుండగా పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం, ఆయనకు అతి దగ్గరగా రావడంతో కలకలం రేగింది. తొక్కిసలాట తరహా పరిస్థితి తలెత్తింది. దీనిపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. ''భారత్ జోడో యాత్రలో తీవ్రమైన భద్రతా లోపాలు తలెత్తిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 24వ తేదీన పాదయాత్ర ఢిల్లీలోకి అడుగుపెట్టిన సమయంలో అనేక సందర్భాల్లో భద్రతా లోపాలు చోటుచేసుకున్నాయి. జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న రాహుల్‌కు అతి దగ్గరగా జనం గుమిగూడుతున్నప్పుడు వారిని అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం మౌన ప్రేక్షకునిగా చూస్తుండిపోయారు. యాత్రలో పాల్గొనకుండా పలువురు ప్రముఖులను వేధించారు. యాత్రలో పాల్గొన్న అనేక మందిని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటరాగేట్ చేసింది. హర్యానా స్టేట్ ఇంటెలిజెన్స్‌కు చెందిన

గుర్తుతెలియని దుండగులు భారత్ జోడీ యాత్రలో అక్రమంగా ప్రవేశించారని డిసెంబర్ 23న సోహ్నా సిటీ పోలీస్ స్టేషన్‌లో మేము ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు'' అని ఆ లేఖలో అమిత్‌షాకు వేణుగోపాల్ తెలియజేశారు.

కాంగ్రెస్ నేతల త్యాగాలను సైతం వేణుగోపాల్ ఆ లేఖలో గుర్తు చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని, 2013 మే 25న జీరమ్ ఘాటిలో నక్సల్స్ దాడిలో ఛత్తీస్‌గఢ్ నాయకత్వం మొత్తం అశువులు బాసిందని అన్నారు. ''జనవరి 3 నుంచి అత్యంత సున్నితమైన పంజాబ్ రాష్ట్రం, జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర సాగాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న రాహుల్, భారత్ జోడోయాత్రలో పాల్గొంటున్న కార్తకర్తలు, ప్రజలు, నేతలకు తగిన భద్రత కల్పించాలి'' అని అమిత్‌షాను ఆ లేఖలో వేణుగోపాల్ కోరారు.

Updated Date - 2022-12-28T15:47:53+05:30 IST