Modi Didi: స్నేహం చిగురిస్తోందా? బెంగాల్‌లో ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2022-11-25T21:31:54+05:30 IST

పశ్చిమబెంగాల్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప్పు-నిప్పులా వ్యవహరించే భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య...

Modi Didi: స్నేహం చిగురిస్తోందా? బెంగాల్‌లో ఏం జరుగుతోంది?
Modi Didi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప్పు-నిప్పులా వ్యవహరించే భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య కొంత సయోధ్య నెలకొంటోందని తెలుస్తోంది. తీవ్ర విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీ బెంగాల్ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారి (Suvendu Adhikari) తో కాసేపు సమావేశమయ్యారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సుబేందు తన తమ్ముడు లాంటి వాడని సంభోదించారు. టీ తాగేందుకు రావాలని కూడా పిలిచారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీదీ తనను టీ తాగేందుకు పిలిచారని, అయితే తాను టీ తాగలేదని సుబేందు చెప్పారు. కేవలం మర్యాద పూర్వక భేటీ తప్ప మరేమీ లేదని తేల్చి చెప్పారు.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుబేందు నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతను ఓడించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఎన్నికల సందర్భంగానూ, ఆ తర్వాత కూడా రెండు పార్టీల మధ్య నిరంతరం యుద్ధ వాతావరణమే ఉండేది. ఈ పరిస్థితుల్లో దీదీ సుబేందుతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవానికి వీరిద్దరూ 5 నిమిషాలే సమావేశమైనా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోదీ-దీదీ మధ్య మళ్లీ దోస్తీ కుదురుతుందనడానికి ఇవే సంకేతాలని బెంగాల్ కాంగ్రెస్ పార్టీ నేత కమురుజ్జాన్ చౌదరి ఆరోపించారు. 2024లో ఇద్దరూ కలిసిపోతారని ఆయన జోస్యం చెప్పారు.

వాస్తవానికి కేంద్రం ప్రధానమంత్రి గ్రామ్ ఆవాస్ యోజన కింద బెంగాల్‌కు రావాల్సిన నిధులను నిన్ననే విడుదల చేసింది. డిసెంబర్ 5న దీదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ని కలవబోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే దీదీ-మోదీ దోస్తీ మళ్లీ ప్రారంభం కాబోతోందని తెలియజేస్తోందని కమురుజ్జాన్ చౌదరి చెబుతున్నారు. సీపీఎం నేత సుజాన్ చక్రవర్తి కూడా టీఎంసీ-బీజేపీ మధ్య స్నేహానుబంధం కుదురుతోందని ఆరోపించారు.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ-బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడినా తృణమూల్ గతంలో కన్నా అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. బీజేపీ ప్రధాన ప్రతిపక్షమైంది. సీపీఎం, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయాయి. ఇటీవలి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన జగ్‌దీప్ ధన్‌కర్‌కు మేలు చేసేలా టీఎంసీ ఓటింగ్‌ నుంచి గైర్హాజరైంది. ఇది కూడా టీఎంసీ-బీజేపీ మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు అవకాశమిచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దీదీ-సుబేందు భేటీ కావడం సహజంగానే బెంగాల్ రాజకీయాల్లో చర్చగా మారింది.

Updated Date - 2022-11-25T21:39:12+05:30 IST