Lokesh Padayatra: తప్పులుంటే నేను క్షమాపణ చెబుతా.. నిజమైతే మీరు చెబుతారా.. వైసీపీకి లోకేష్ సవాల్
ABN , First Publish Date - 2023-03-02T14:33:16+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.
తిరుపతి: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalam) కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న యువనేత (Nara Lokesh) దామలచెరువులో ముస్లింలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ (YuvaGalam) మాట్లాడుతూ.. ‘‘జగన్ (AP CM) 25 మంది ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. దీక్ష చేశారు. ధర్నా చేశారు. ఈరోజు ఆ ధర్నాలు ఏమైంది. ఒక రోజైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడాడా?’’ అని ప్రశ్నించారు. అయితే ‘‘మాకూ 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా (Special Status)మాత్రమే కాదు విభజన చట్టంలోని ప్రతి అంశం పైన పోరాడుతాము. అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాం’’ అంటూ లోకేష్ హామీ ఇచ్చారు. కేసీఆర్ (Telangana CM KCR)తో జగన్ (YS Jagan mohan Reddy) కుమ్మక్కయ్యారని.. అందుకే ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)హక్కుల కోసం తెలంగాణ (Telangana)లో, ఢిల్లీ (Delhi)లో నోరు మెదపడం లేదని విమర్శించారు. ఉర్దూ టీచర్ పోస్టులు నుంచి హజ్ యాత్రకు సహాయం వరకు మైనారిటీల కోసం తాము ఎన్నో చేశామని గుర్తుచేశారు. ‘‘మేము చేసినవి ప్రచారం చేసుకోలేదు అదే మేం చేసిన తప్పు’’ అని అన్నారు. ముస్లిముల కోసం టీడీపీ (TDP) ఏం చేసింది.. ఈ నాలుగేళ్లలో వైసీపీ (YCP) ఏం చేసింది? అనే విషయంపై ఉప ముఖ్యమంత్రితో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఎక్కడికి వస్తారో ఎప్పుడో చెప్తే తాను చర్చకు సిద్ధమని యువనేత సవాల్ విసిరారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు తాము ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కర్ణాటక (Karnataka) లో డీకేటీ పట్టాలపై ఉన్న చట్టాన్ని అధ్యయనం చేసి ఇక్కడ కూడా డీకేటీపై మంచి చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఫోన్లో బటన్ నొక్కితే అన్ని వస్తువులు వస్తున్నాయని... అలాగే సంక్షేమ పథకాలు గాని ప్రభుత్వ స్పందన గాని ఫోన్ నొక్కితే జరిగేలా చేస్తామని చెప్పారు. బిడ్డ పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన వెంటనే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఆటోమేటిక్గా ఫోన్లో బటన్ నొక్కితే వచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ నిధులతో కబరిస్తాన్‌ల కాంపౌండ్ వాల్‌లను నిర్మిస్తామన్నారు.
వైసీపీ ప్రభుత్వం (YCP Government) అరాచకాలతో ముస్లిం మైనార్టీకి చెందిన పది మందిని చంపేశారని ఆరోపించారు. 45 మందిపై దాడులు చేశారని.. అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనారిటీ అయినా ఆత్మహత్య చేసుకున్నారా? ఎక్కడైనా దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. ఏ రోజైనా మైనారిటీకి చెందిన ఉపముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చున్నాడా అంటూ నిలదీశారు. ‘‘నేను చెప్పిన దానిలో ఒక్క తప్పు ఉన్న క్షమాపణ చెప్తాను. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే వైసీపీ నేతలు క్షమాపణ చెప్తారా’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ముస్లిముల్లోని దూధకులా వారిని వైసీపీ ప్రభుత్వం హిందువులుగా పరిగణించడం దారుణమన్నారు. రెండుసార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)ని ఎమ్మెల్యేగా గెలిపించారని.. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగారు. 30 రోజులుగా పాదయాత్ర చేస్తున్నానని... ఈ నియోజకవర్గంలో నడుస్తుంటే మాత్రం మొదటిసారి కాళ్లు నొప్పి వస్తున్నాయని.. అంత దారుణంగా చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్లు తయారయ్యాయని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థి నానిని గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని లోకేష్ పేర్కొన్నారు.