CPI Ramakrishna: ఏపీని గజదొంగల ముఠా పరిపాలిస్తుంది
ABN , First Publish Date - 2023-08-24T16:28:16+05:30 IST
ఏపీని గజదొంగల ముఠా పరిపాలిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI Ramakrishna) విమర్శించారు.
ఏలూరు జిల్లా : ఏపీని గజదొంగల ముఠా పరిపాలిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI Ramakrishna) విమర్శించారు. గురువారం నాడు సీపీఐ 26జిల్లాల బస్సుయాత్రలో భాగంగా నూజివీడులో భూ సమస్యలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఆగస్టు 17వ తేదీన విశాఖ ఉక్కుఉద్యమ కేంద్రం నుంచి ప్రారంభమయింది. ఈ బస్సు యాత్ర సెప్టెంబర్ 8 వరకు 26జిల్లాల మీదుగా సాగుతుందని రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గజదొంగల ముఠా పరిపాలిస్తుంది, పేరుకే పేదల రాజ్యం.. పెద్దవాళ్లకు జగన్‌రెడ్డిఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్(CM Jagan) రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల పేదల భూములను దోచుకొని వైసీపీ నేతలకు కట్ట పెడుతున్నారని మండిపడ్డారు. 13లక్షల ఎకరాల అసైన్డ్ మెంట్ భూములకు చట్టబద్ధత కల్పించి, పేదల భూములను ఆగ్రకులాలు, పెత్తందారులకు కట్టపెట్టేందుకు జగన్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు.వైసీపీ నేతలు భూకబ్జాలు, ఇసుక మాఫియాతో రెచ్చిపోతుంటే, జగన్ లిక్కర్ మాఫియా చేస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు.సెప్టెంబర్8వ తేదీ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేసి వైసీపీ(YCP)ని గద్దె దించే వరకు పోరాడుతామని రామకృష్ణ హెచ్చరించారు.