CM Jagan : ఏడుకొండల వెంకన్నా.. కన్నావా.. విన్నావా!

ABN , First Publish Date - 2023-08-15T03:09:48+05:30 IST

పెద్ద పదవుల్లో ఉన్న వారు ‘భవిష్యత్‌ అవసరాలకు’ పనికొస్తారనుకుంటే చాలు... రకరకాల మార్గాల్లో వారి ‘చల్లని చూపుల’ కోసం ప్రయత్నిస్తుంటారు.

CM Jagan : ఏడుకొండల వెంకన్నా.. కన్నావా.. విన్నావా!

ఎవరితో అవసరముంటే వాళ్లను అలా ‘వల’లో వేసుకోవడం... ‘మంచి’ చేసుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఆది నుంచీ అలవాటు! సలహాదారు పదవులిచ్చినా... రాజ్యసభ స్థానాలు కేటాయించినా ఆయనకు ఒక ‘లెక్క’ ఉంటుంది! ఇదో ‘చీప్‌’ టెక్నిక్‌! కానీ... ఈసారి అదే టెక్నిక్‌ను ఏకంగా చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాపైనే ప్రయోగించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆయనతోపాటు అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చీఫ్‌పైనా అదే వల విసిరినట్లు సమాచారం. దీనికోసం ఏకంగా కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశ్వర స్వామినే ఉపయోగించుకున్నారు.

స్వప్రయోజనాల కోసం చీఫ్‌ మినిస్టర్‌ ‘చీప్‌ ట్రిక్స్‌’

భారత చీఫ్‌ జస్టిస్‌, సీబీఐ చీఫ్‌పైనే వల

వేంకటేశ్వర స్వామినీ వదలకుండా వాడకం

టీటీడీ బోర్డు సభ్యత్వంపై వారికి సమాచారం

‘మీ వాళ్లెవరైనా ఉన్నారా’ అంటూ కబురు

నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ఆ ఇద్దరు

పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే అజెండా

గతంలో గవర్నర్‌ మేనల్లుడికి ‘ప్రత్యేక’ పదవి

(అమరావతి - ఆంధ్రజ్యోతి): పెద్ద పదవుల్లో ఉన్న వారు భవిష్యత్‌ అవసరాలకు’ పనికొస్తారనుకుంటే చాలు... రకరకాల మార్గాల్లో వారి ‘చల్లని చూపుల’ కోసం ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా ఒకస్థాయి వాళ్లతో పని చేయించుకోవాలంటే డబ్బులో, ఆస్తులో, బినామీల పేరుతో వాటాలో సమర్పించుకోవడం సహజం. కానీ... అత్యున్నత స్థాయి వ్యక్తుల ముందు ఇలాంటి ఆటలు సాగవు. అందుకే జగన్‌ కొత్త రూటు(Jagan's new route)లో వెళ్లారు. భక్తిని, సెంటిమెంటును ప్రయోగించారు. అదే... తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) పాలకమండలి సభ్యత్వం! జగత్‌ విఖ్యాతి చెందిన దేవదేవుడి సన్నిధిలో పాలక మండలి సభ్యుడిగా ఉండటం జన్మజన్మల అదృష్టంగా భావించే వారు ఎందరో! రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండేందుకు తహతహలాడతారు. బోర్డు సభ్యత్వం ఇస్తామంటే ‘మహద్భాగ్యం’గా భావిస్తారు. దీన్ని ఆసరాగా తీసుకుని టీటీడీ బోర్డు సభ్యత్వంపై ప్రముఖులకు ఉన్న ఆసక్తిని జగన్‌ గతంలోనూ ఉపయోగించుకున్నారు. చట్ట ప్రకారం టీటీడీ చైర్మన్‌ (TTD Chairman) సహా 29 మంది మాత్రమే సభ్యులుగా ఉండాలి. కానీ... రకరకాల ‘అవసరాల’ రీత్యా ఏకంగా 50 మందిని స్పెషల్‌ ఇన్వైటీస్‌ పేరుతో ‘బోర్డు’లో కూర్చోబెట్టారు. వారు సరిపోదన్నట్లుగా మరో ఇద్దరిని ప్రత్యేకంగా చేర్చారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో... స్పెషల్‌ ఇన్వైటీస్‌ పదవులు ఊడిపోయాయి. తాజాగా... కొత్త పాలక మండలిని నియమించాల్సి ఉంది. ఒక బంధువు వైవీ సుబ్బారెడ్డి స్థానంలో మరోబంధువు భూమన కరుణాకర్‌ రెడ్డి(Bhumana Karunakar Reddy)ని కొత్త చైర్మన్‌గా నియమించారు. ఇక మిగిలింది సభ్యుల నియామకమే! దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. గత శుక్రవారమే సంబంధిత జీవో జారీ అవుతుందని కూడా భావించారు. కానీ... అది పెండింగ్‌లో పడింది. ఎందుకు, ఏమిటని ఆరా తీస్తే విస్మయకరమైన విషయం బయటపడింది.


‘అత్యున్నత స్థాయి’లో...

జగన్‌పై భారీ స్థాయిలో సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా... వివేకానందారెడ్డి హత్య కేసులో సీఎం సోదరుడు ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డిపైనా సీబీఐ విచారణ జరుగుతోంది. ఈ కేసులు రకరకాల రూపాల్లో స్థానిక న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు విచారణకు వెళ్తున్నాయి. దీంతో జగన్‌ ఒకేకాలంలో అటు న్యాయవ్యవస్థ, ఇటు సుప్రీంకోర్టుపై గురిపెట్టారు. కొడితే కుం భస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా... ఏకంగా ఆ రెండు వ్యవస్థల ‘చీఫ్‌’లనే ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినట్లు అ త్యంత విశ్వసనీయంగా తెలిసింది. ‘‘మీ వాళ్లెవరైనా ఉంటే చె ప్పండి. టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమిస్తాం’’ అని సు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌కు, సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు కబురు పంపినట్లు తెలిసింది. అయి తే... నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న తాము ఇలాంటి అంశాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో, మరోమాటకు తావివ్వకుం డా వారిద్దరూ జగన్‌ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం!

జగన్‌ అజెండా జగమెరిగిన సత్యమే...

ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సీబీఐ చీఫ్‌నే ప్రసన్నం చేసుకోవడం నిజమా? ఏడుకొండల స్వామినే రాజకీయాలకు వాడుకున్నారా? అని కొందరికైనా సందేహాలు రావొచ్చు. కానీ... సొంత అవసరాలకోసం ఎవరినైనా వాడుకోవడం, ఎవరితోనైనా ఆడుకోవడం జగన్‌ నైజమన్నది జగమెరిగిన సత్యం. అది... అందరికీ తెలిసిన అజెండాయే! అప్పట్లో గవర్నర్‌గా ఉన్న విశ్వభూషణ్‌ హరిచందన్‌ మేనల్లుడిని జగన్‌ భువనేశ్వర్‌లోని టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్‌గా నియమించారు. స్థానిక సలహా మండలి చైర్మన్‌కు టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానముంటుంది. అలా నాటి గవర్నర్‌ మేనల్లుడు టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి క్రమంతప్పకుండా నివేదికలు పంపడం గవర్నర్‌ బాధ్యతల్లో కీలకమైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే... తను ఆరాధించే విశాఖ శారదా పీఠాధిపతి చెప్పారని హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ లక్ష్మీనారాయణను టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. ఆయన వివాదాల్లో చిక్కుకుని అరెస్టు కావడంతో... టీటీడీ పదవిని వదులుకోక తప్పలేదు. ఇక... తాను అడిగినప్పుడల్లా అవసరమైన సహకారం అందిస్తున్న బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చెప్పారని గోవింద్‌ హరి అనే వ్యక్తిని హైదరాబాద్‌ టీటీడీ ఆలయ చైర్మన్‌గా నియమించి... ఆయనను టీటీడీ బోర్డులో ‘ప్రత్యేకం’గా ఆహ్వానించారు. కోర్టు జోక్యంతో రద్దయిన 50 మంది ‘ప్రత్యేక ఆహ్వానితుల్లో’ పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు లేదా వారి సిఫారసు మేరకు నియమితులైన వారే ఎక్కువమంది. తాజా బోర్డు సభ్యుల వివరాలు బయటికి వస్తే... ఏ వ్యక్తి వెనుక ఎవరున్నారు, ఎలాంటి ప్రయోజనాలను ఆశించి వారిని టీటీడీ పాలక మండలిలో కూర్చోబెట్టారనే విషయం తెలుస్తుంది.

Updated Date - 2023-08-15T03:40:45+05:30 IST