CPM Srinivasa Rao: ఏపీ ప్రభుత్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలా తయారయ్యింది
ABN , First Publish Date - 2023-10-28T15:08:41+05:30 IST
ఏపీ ప్రభుత్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలా తయారయ్యిందని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు ( CPM Srinivasa Rao ) అన్నారు.
ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలా తయారయ్యిందని సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు ( CPM Srinivasa Rao ) అన్నారు. శనివారం నాడు సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘అక్టోబర్ 30 తేదీ నుంచి ఏపీలో సీపీఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో సీపీఎం రాజకీయ విధానాన్ని ప్రజలకు చెప్పడం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అంశాలను ప్రజలకు చెప్పే కార్యాచరణతో ప్రజా రక్షణ భేరి కార్యచరణ ఉంటుంది. కర్నూలు జిల్లా ఆదోని, శ్రీకాకుళం జిల్లా ముందస, పార్వతిపురం జిల్లా సీతం పేట నుంచి విజయవాడ వరకు బస్సు జాతాలు జరగనున్నాయి. నవంబర్ 15 తేదీ విజయవాడలో ప్రజా రక్షణ భేరి సభ నిర్వహిస్తాం. విజయవాడ సభకు సీతారాం ఏచూరి, రాఘవులు హాజరుకానున్నారు. వామపక్ష పార్టీలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. 10 సంవత్సరాల్లో కేంద్రం ఏపీకి సంబంధించిన ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ప్రత్యేక హామీలు, విశాఖ, కడప ఉక్కు పరిశ్రమల అంశాలను కేంద్రం పట్టించుకోలేదు. ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేస్తుంది. కేంద్రం అన్యాయం చేస్తుంటే రాష్ట్రంలో రాజకీయపార్టీలు మాట్లాడకపోవడం దురదృష్టకరం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ఎన్డీఏలో ఉన్నాడో చెప్పాలి. ఏపీకి ఏం చేసింది అని ఇంకా ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. బీజేపీ ఎన్డీఏను ఎందుకు పవన్ కళ్యాణ్ మోస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని బీజేపీతో ఎందుకు చేతులు కలుపుతున్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపడతారా బీజేపీ ముందు మోకరిల్లుతారా తేల్చుకోవాలి. అవినీతిని నిర్ములించాలన్న ఆలోచన చిత్తశుద్ధి కేంద్రానికి లేదు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించాం. కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ విషయంలో నాటకం ఆడుతుంది. బీజేపీ వల్ల ప్రజాస్వామ్య హక్కులు హరించబడుతున్నాయి. బీజేపీని ఆదర్శంగా తీసుకుని వైసీపీ హక్కులను హరిస్తుంది. వైసీపీ సామాజిక న్యాయం పాటించడం లేదు. ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు’’ అని వి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.