AP News: అమరావతిలో టీడీపీ కార్యకర్తపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-07-07T11:54:35+05:30 IST
అమరావతి మండలం ధరణికోటలో టీడీపీ కార్యకర్త సంజయ్‌పై వైసిపి దాడిని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు.
పల్నాడు: అమరావతి మండలం ధరణికోటలో టీడీపీ కార్యకర్త సంజయ్‌పై వైసీపీ దాడిని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ (Former MLA Kommalapati Sridhar) తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లడుతూ.. ధరణికోటలో అర్ధరాత్రి సోషల్ మీడియా కార్యకర్తపై దాడికి పాల్పడడం, వైసీపీ నేతల పిరికిపంద చర్య అని అన్నారు. జగన్ లాగానే.. ఆయన కార్యకర్తలు తయారయ్యారని మండిపడ్డారు. దౌర్జన్యం.. దుర్మార్గం వైసీపీకి పేటెంట్ హక్కుగా మారిపోయాయన్నారు. వైసీపీ తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. దాడులకు తెగబడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టం కూడా వైసీపీకి చుట్టంగా మారిపోయిందన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు.. వైసీపీ నేతలకు దాసోహం అంటున్నారని మండిపడ్డారు. ఇక ఎన్నాళ్లో వైసీపీ దుర్మార్గాలు సాగవని.. అక్రమ దాడులకు పాల్పడ్డ ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటుందని కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే...
అమరావతిలో టీడీపీ కార్యకర్త సంజయ్ ఇంటిపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న సంజయ్‌పై వైసీపీ నేతలు దాడి చేసేందుకు వెళ్లారు. దాడిని అడ్డుకోబోయిన సంజయ్ భార్య శ్రీదేవిపై కూడా వైసీపీ నాయకుడు దాడి చేశాడు. దాడి దృశ్యాలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా శ్రీదేవిపై వైసీపీ నాయకుడు దాడి చేశాడు. శ్రీదేవి కేకలు వేయడంతో వైసీపీ నేతలు పరారయ్యారు. ఈ దాడి ఘటనకు సంబంధించి వైసీపీ నేతలపై సంజయ్ భార్య శ్రీదేవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.