Vajja Srinivas: స్కిల్ కేసులో ఐఏఎస్ అధికారులను ఎంక్వైరీ చేయాలని కోరాం
ABN , First Publish Date - 2023-11-02T22:43:38+05:30 IST
స్కిల్ కేసులో ఐఏఎస్ అధికారులను ఎంక్వైరీ చేయాలని సీఐడీని కోరామని ఫిర్యాదు దారు తరపు అడ్వకేట్ వజ్జా శ్రీనివాస్ ( Vajja Srinivas ) అన్నారు.
అమరావతి: స్కిల్ కేసులో ఐఏఎస్ అధికారులను ఎంక్వైరీ చేయాలని సీఐడీని కోరామని ఫిర్యాదు దారు తరపు అడ్వకేట్ వజ్జా శ్రీనివాస్ ( Vajja Srinivas ) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీలో సభ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారులను విచారించాల్సిందిగా ఫిర్యాదు చేశాం. విచారణ ప్రారంభమైన తర్వాత కూడా ఐఏఎస్ అధికారులను అక్యూజ్డ్ లిస్టులో చేర్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వైఎస్ హయాంలో జరిగిన కుంభకోణాల విషయంలో ఇదే జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రూ. 27 కోట్లు టీడీపీకి వచ్చాయని సీఐడీ ఆరోపిస్తోంది. గోప్యంగా ఉండాల్సిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలు సీఐడీకి ఎలా తెలిశాయన్న అంశంపైనా విచారణ చేయించమని కోరాం. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలని సీఐడీ ఏడీజీకి ఫిర్యాదు చేశాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సెంటర్లు అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రస్తుత చైర్మన్ అజేయ్‌రెడ్డి ప్రకటనలు ఇస్తున్నారు. స్కిల్ సెంటర్లు అసలు పని చేయడం లేదని సీఐడీ అధికారులు చెబుతున్నారు. పని చేయని స్కిల్ సెంటర్లు పని చేస్తున్నట్టుగా అజేయ్‌రెడ్డి చెబుతున్నారా..? స్కిల్ సెంటర్ల పేరుతో డబ్బులు పక్క దారి పట్టించారేమోననే అనుమానంతో అజేయ్‌రెడ్డిని విచారించాల్సిందిగా కోరాం.ఫిర్యాదు చేయడానికి సీఐడీ కార్యాలయానికి వెళ్తే సరిగా పట్టించుకోలేదు. ఫిర్యాదును సీఐడీ చీఫ్‌కు మెయిల్ చేశాం.. రిజిస్టర్ పోస్టులోనూ పంపాం. మా ఫిర్యాదును స్వీకరించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’’ అని వజ్జా శ్రీనివాస్ తెలిపారు.