Varla Ramaiah: ఫిడెల్ క్యాస్ట్రో ఏం చెప్పారో.. జగన్‌రెడ్డి అదే పాటిస్తున్నారు
ABN , First Publish Date - 2023-09-11T16:33:07+05:30 IST
పాలకులు అవినీతిపరులైతే నీతిమంతులు జైల్లో ఉంటారని ఫిడెల్ క్యాస్ట్రో(Fidel Castro) చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.
అమరావతి: పాలకులు అవినీతిపరులైతే నీతిమంతులు జైల్లో ఉంటారని ఫిడెల్ క్యాస్ట్రో(Fidel Castro) చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ (jagan)16 నెలలు చంచల్‌గూడ జైలులో ఉన్నాడని.. చంద్రబాబు(Chandrababu)ను కూడా కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలన్నది జగన్ ఆకాంక్ష అని చెప్పారు.జగన్ కబంధ హస్తాల నుంచి చంద్రబాబును కాపాడాలని ఆయన సతీమణి భువనేశ్వరి కనకదుర్గమ్మను వేడుకుంటే ఓ మహిళా మంత్రి వ్యంగంగా మాట్లాడిన మాటలు సిగ్గుపడేలా ఉన్నాయి. జగన్‌రెడ్డి కక్ష, పగ, ఈర్ష్య, ద్వేషంలో భాగంగనే చంద్రబాబును అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు అహోరాత్రులు కష్టపడ్డారన్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ తన తాహతును దిగజార్చుకుని సమాజంలో అభాసుపాలయ్యారన్నారు. జగన్ ఆడిన ఈ చదరంగంలో అనేకమంది పావులుగా మారారని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేయడంలో చూపిన చొరవ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ఎందుకు చూపలేదు? అని ప్రశ్నించారు. అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్ ఎలా ఎదిగారో ప్రజలే ఆలోచించాలన్నారు. రాజకీయ క్రీడలో భాగంగా చంద్రబాబును అభాసుపాలు చేయడం న్యాయమా? అని నిలదీశారు. గతంలో మన్మోహన్‌సింగ్ సైతం చంద్రబాబునాయుడును ఏమైనా అంటే ఊరుకునేది లేదన్న విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు అరెస్టుతో సంబురాలు చేసుకుంటున్న వైసీపీ నాయకులు, మంత్రులకు ప్రజలే సమాధానం చెబుతారన్నారు.జగన్ వెకిలి చేష్టలు, హేళన, లోప బుద్ధి, లోభిత్వం సరైందికాదన్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారని వర్ల రామయ్య పేర్కొన్నారు.