Viveka Case : కడప హరిత హోటల్‌లో సీబీఐ అధికారులు.. నోటీసులు వస్తేనే విచారణ అంటున్న భాస్కర్‌రెడ్డి.. ఏం జరుగుతుందో?
ABN , First Publish Date - 2023-02-25T12:50:22+05:30 IST
మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకూ తీగ లాగి దాదాపు డొంకను కదిలించేశారు. ఇక విచారణల పర్వం పూర్తి చేసే దశలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రెండు సార్లు అధికారులు విచారించారు.
కడప : మాజీ మంత్రి వివేకా (YS Viveka) హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకూ తీగ లాగి దాదాపు డొంకను కదిలించేశారు. ఇక విచారణల పర్వం పూర్తి చేసే దశలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (YCP MP Avinash Reddy)ని రెండు సార్లు అధికారులు విచారించారు. అసలు ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy)ని నేడు సీబీఐ అధికారులు విచారించాల్సి ఉంది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది.
నేడు ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy) సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మొన్నటికి మొన్న తనకు పనులున్నాయని విచారణకు హాజరు కాలేనని సీబీఐ వద్ద భాస్కర్‌రెడ్డి మొరపెట్టుకున్నారు. దీంతో సీబీఐ (CBI) సైతం విచారణకు మరో తేదీ ప్రకటిస్తామని వెల్లడించింది. ఆ గడువు ప్రకారం 25న అంటే నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరిగే విచారణకు హాజరుకావాలని నిన్న భాస్కర్ రెడ్డికి మరోసారి అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు ఆయన సెల్ వాట్సప్‌కు నోటీసు సైతం పంపారు.
అయితే తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసూ రాలేదని భాస్కర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. మీడియాలో చూసిన తరువాతే తెలిసిందని ఆపై సీబీఐ ఎస్పీకి ఫోన్ చేశానని చెప్పడం కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. మరోవైపు సీబీఐ బృందం హైదరాబాద్ నుంచి కడప చేరుకుంది. కడప హరితా హోటల్‌లో బస చేస్తున్నారు. అయితే విచారణకు రావాలా? అంటూ సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు మెసేజ్‌తోపాటు ఫోన్ చేశానని కానీ తనకు ఎలాంటి రిప్లై రాలేదని భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. సీబీఐ నుంచి సమాధానం కోసం వేచి ఉన్నానని.. మళ్లీ సీబీఐ నోటీసులు వచ్చాకే హాజరు కావాలని భాస్కర్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఏ జరుగుతుందో వేచి చూడాలి.