Jagan Delhi Tour : వివేకా హత్య కేసులో సుప్రీం కీలక ఆదేశాలు.. హుటాహుటిన ఢిల్లీకి సీఎం జగన్.. ఏం జరుగుతుందో..!

ABN , First Publish Date - 2023-03-29T15:32:46+05:30 IST

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) మరోసారి హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనమై వెళ్లారు. రెండ్రోజుల పాటు

Jagan Delhi Tour : వివేకా హత్య కేసులో సుప్రీం కీలక ఆదేశాలు.. హుటాహుటిన ఢిల్లీకి సీఎం జగన్.. ఏం జరుగుతుందో..!
CM JAGAN

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీని రామ్‌సింగ్‌ను తొలగిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) మరోసారి హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనమై వెళ్లారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి మకాం వేయనున్నారు. ఈనెల 16న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా... సెషన్స్‌ను పక్కన పెట్టి మరీ హస్తినకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లడం.. అది కూడా సుప్రీం ఆదేశాల తర్వాత హస్తిన పర్యటనతో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

కాగా.. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వివేకా హత్య కేసు (Viveka murder case)లో కీలక పరిణామం చోటుచేసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసును ఏప్రిల్ 30లోగా ముగించేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇంకోవైపు ఈ కేసులో సుప్రీం ఆదేశాల మేరకు కొత్త సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. ముందస్తు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గాబరాగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈరోజు (బుధవారం) రాత్రి 9:30 నిమిషాలకు అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

Updated Date - 2023-03-29T17:00:36+05:30 IST