BV Raghavulu: వైసీపీ మంత్రుల ఉపన్యాసాలు హాస్యాస్పదంగా ఉన్నాయి
ABN , First Publish Date - 2023-11-03T20:55:10+05:30 IST
వైసీపీ మంత్రుల ( YCP Ministers ) ఉపన్యాసాలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయని సీపీఎం కేంద్ర నాయకులు బీవీ రాఘవులు ( BV Raghavulu ) సెటైర్లు వేశారు.
విజయవాడ: వైసీపీ మంత్రుల ( YCP Ministers ) ఉపన్యాసాలు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయని సీపీఎం కేంద్ర నాయకులు బీవీ రాఘవులు ( BV Raghavulu ) సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక సాధికారిత యాత్రలకు ప్రజలు రావడం లేదు. సామాజిక న్యాయాన్ని సంహారం చేస్తూ వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. అటవీ రక్షణ చట్టాన్ని సవరణ చేసి గిరిజన హక్కులను కాలరాసేలా వైసీపీ మద్దతు ఇచ్చింది. పనికి ఆహార పథకం అమలు చేయకుండా అడ్డుకునే విధానానికి వైసీపీ మద్దతు ఇచ్చింది. సామాజిక న్యాయాన్ని అపహాస్యం చేసి, సామాజిక యాత్ర అంటూ వైసీపీ నేతలు బయలుదేరారు. సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తూ, సాధికారిత పేరుతో వైసీపీ నాటకాలు ఆడుతుంది. దళితులు, పేదలు లబ్ధి పొందే పథకాలకు సీఎం జగన్‌రెడ్డి తూట్లు పొడిచారు. పేదలను ఎగతాళి చేస్తూ, కార్మికులను హేళన చేస్తున్నారు. సామాజిక న్యాయానికి సాధికారిత ఇస్తున్నామని చెప్పే అర్హత వైసీపీ నేతలకు లేదు. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఆ రోజును నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని వైసీపీ నేతలు ఆవిష్కరించడం అంటే అపచారం చేయడమే’’ అని బీవీ రాఘవులు తెలిపారు.
వైసీపీకి అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు: బీవీ రాఘవులు
‘‘బీజేపీ 125ఏళ్ల రాజ్యాంగ విలువులకు పాతరేస్తుంది. ఇప్పుడు జగన్ అదే 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు. బీజేపీకి మద్దతుగా ఉన్న వైసీపీకి అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు. లౌకిక వాదం, ప్రజాస్వామ్య వాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం జగన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రజలు కూడా బాగా ఆలోచించి.. కేంద్రంలో బీజేపీని ఓడించాలి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో మేము కలిసి పని చేస్తాం. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. వారు తీరు మార్చుకోకుంటే.. ఆ పార్టీలను ఓడించాలని ప్రజలకు చెబుతున్నాం. వచ్చే ఎన్నికలల్లో వామపక్ష పార్టీలు ఉమ్మడిగా కలిసి పని చేస్తాయి’’ అని బీవీ రాఘవులు తెలిపారు.
ఈనెల 15న ప్రజారక్షణ బేరి బహిరంగ సభ
నవంబర్ 15వ తేదీన జరిగే ప్రజారక్షణ బేరి బహిరంగ సభ సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించినట్లు సీపీఎం కేంద్ర నాయకులు బీవీ రాఘవులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఏపీలో సీపీఎం అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ప్రజారక్షణ భేరిని నిర్వహిస్తుంది. అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి జాతాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రమాదకరమైన విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. అవకాశవాద రాజకీయాలు, ఆక్షేపణీయమైన రాజకీయాల గురించి ప్రజలకు చెబుతున్నాం. మోస పూరిత విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళ్తున్నాం. బీజేపీ, వైసీపీ పార్టీలను ఓడించి తగిన బుద్ది చెప్పాలని ప్రజలను కోరుతున్నాం’’ అని బీవీ రాఘవులు తెలిపారు.