Devineni Uma : భవాని భక్తులు విజయవాడకు రాకూడదని ఆంక్షలా?
ABN , First Publish Date - 2023-10-18T11:13:11+05:30 IST
విజయవాడ (గొల్లపూడి)లో దేవినేని ఉమ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతాంగ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయనను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు.
విజయవాడ : విజయవాడ (గొల్లపూడి)లో దేవినేని ఉమ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతాంగ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయనను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయని.. ముఖ్యమంత్రి జగన్ ఏమి ఆలోచిస్తున్నాడని ప్రశ్నించారు. భవాని భక్తులు విజయవాడకు రాకూడదని ఆంక్షలా? అని నిలదీశారు. 10 లక్షల మంది భక్తులు వచ్చే విజయవాడ మహానగరంలో భయభ్రాంతులు సృష్టిస్తున్నారన్నారు. భక్తులను కాపాడాల్సిన పోలీసులను టీడీపీ నాయకులు కార్యకర్తల ఇళ్ల దగ్గర పెట్టి బలి పశువుల్ని చేస్తున్నారన్నారు.
ఒక మూర్ఖుడైన ముఖ్యమంత్రి చేసే తెలివి తక్కువ పనులకు మీరు బలవుతున్నారని పోలీసులను ఉద్దేశించి దేవినేని ఉమ అన్నారు. ‘‘రాజమండ్రి భువనేశ్వరి అమ్మగారిని కలవడానికి వెళ్తుంటే పోలీసులను అడ్డం పెడుతున్నారు. ఒక మాజీ మంత్రి, బీసీ నాయకుడు కొల్లు రవీంద్రను తల్లి వర్ధంతి కార్యక్రమం చేసుకోవడానికి కూడా వెళ్ళనివ్వడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. వారికి ధైర్యం చెప్పి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. మమ్మల్ని అడ్డుకోవడానికి మీకు ఏం అధికారం ఉంది? పోలీస్ కమిషనర్ వచ్చేసి తన పదవిని కాపాడుకోవడానికి సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లను అడ్డగోలుగా వాడుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నిన్న హైకోర్టులో అధికారులను సవాల్ చేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. పోలీస్ అధికారులు అందరికీ కూడా నోటీసులు అందాయి. నోటీసు ఎవరు.. ఎందుకు జారీ చేస్తున్నారో చెప్పరు. లాక్కెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పడేస్తారు ఇది బాగా అలవాటయింది’’ అని దేవినేని ఉమ మండిపడ్డారు.