Purandeswari: మా సవాల్‌కు ప్రభుత్వం స్పందించలేదు..
ABN , First Publish Date - 2023-10-25T13:37:53+05:30 IST
విజయవాడ: ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా? అని మేము సవాల్ విసిరామని.. కానీ ప్రభుత్వం స్పందించ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.
విజయవాడ: ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా? అని మేము సవాల్ విసిరామని.. కానీ ప్రభుత్వం స్పందించ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Daggubati Purandhareswari) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ బెవరెజెస్ కార్పోరేషన్ (AP Beverages Corporation) వద్ద 100కు డిస్టలరీ కంపెనీల నమోదయ్యాయని, కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయన్నారు. అదాన్ డిస్టలరీస్ (Adan Distilleries) 2019లో మొదలైందని, రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయన్నారు. అదాన్ కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఉన్నారని, ఈ రెండు కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుందని ఆమె ఆరోపించారు. చింతకాయల రాజేష్ (Chintakayala Rajesh), పుట్టా మహేష్ (Putta Mahesh) వంటి వారికి చెందిన సంస్థలను బలవంతంగా అదాన్ కంపెనీ చేజిక్కించుకుందన్నారు.
ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డి (Midhun Reddy) ఉన్నారని పురంధరేశ్వరి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో పెర్ల్ డిస్టలరీస్ దీన్ని సీఎం జగన్ (CM Jagan) సన్నిహితులు బలవంతం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల జాబితా.. ఆ కంపెనీల ఓనర్ల జాబితా ఇవ్వాలంటే ఇవ్వలేదని, ఇప్పుడు మేమే ఆ వివరాలు బయట పెట్టామన్నారు. దశలవారీ మద్య నిషేధం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, మద్యం తయారీదారులు, అమ్మకం దారులను ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామన్నారని.. ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదల చేశామని.. వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని పురంధరేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల వివరాలేవి?.. మద్య నిషేధం అమలు చేయబోమని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు. ఫోన్ పే.. గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కన్పించవని పురంధరేశ్వరి నిలదీశారు.
ఎపీలో అప్పుల భారాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ను కలిసి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఫిర్యాదు చేశామని దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. పార్లమెంట్ (Parliament)లో చేసిన ప్రకటన ఆధారంగా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని వివరించామన్నారు. కార్పోరేషన్లు, రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారని, ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. సీరియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చామని దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు.