Purandeshwari: వైసీపీ స్టిక్కర్ ప్రభుత్వంగా పని చేస్తోంది
ABN , First Publish Date - 2023-10-30T15:25:17+05:30 IST
విజయవాడ: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్టిక్కర్ ప్రభుత్వంగా వైసీపీ పని చేస్తోందని విమర్శించారు.
విజయవాడ: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Daggubati Purandhareswari) జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు. స్టిక్కర్ ప్రభుత్వం (Sticker Govt.)గా వైసీపీ పని చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దుర్భిక్షంతో రైతులు (Farmers) తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పనులు జరగడం లేదని, రాష్ట్రంలో రైతుల ఆత్మ హత్యలు పెరిగాయన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారని పురంధేశ్వరి ఆరోపించారు. మేనిఫేస్టో (Manifesto)లో చెప్పిన విధంగా శీతల గిడ్డంగులు (Cold Storages) ఏవని ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని.. దీనికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?.. అన్నమయ్య ప్రాజెక్టు (Annamayya Project) విషయంలో ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. జేబులు నింపుకోవడం.. మొక్కుబడి పనులు చేయడం.. మద్యం, మైనింగ్‌ల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళతామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.