Atchannaidu: ‘లూటీ చేయడానికే విశాఖలో కాపురమా?’
ABN , First Publish Date - 2023-04-19T16:25:15+05:30 IST
సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతామంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అమరావతి: సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతామంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jaganmohan Reddy) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ విషయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) మాట్లాడుతూ.. లూటీ చేయడానికే విశాఖలో కాపురమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు మింగారని మండిపడ్డారు. సొంత మీడియా లేదంటున్న జగన్ రెడ్డి సాక్షి ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘రూ.2 లక్షల కోట్లు ప్రజా సొమ్ము దోచేసిన మిమ్మల్ని మించిన పెత్తందారు ఎవరు?. మిమ్నల్ని మించిన పేదల ద్రోహి ఎవరున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. సంతబొమ్మాళిలో వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికల స్టంటే అంటే అన్నారు. నాలుగేళ్లుగా గుర్తుకురాని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడే గుర్తుకువచ్చిందా? అంటూ నిలదీశారు. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో వివరాలు బహిర్గతం చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా అంటూ అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.