TDP Leaders: ‘జగన్ కరోనా వైరస్ అయితే చంద్రబాబు బూస్టర్ డోస్’
ABN , First Publish Date - 2023-04-20T12:36:24+05:30 IST
జగన్ కరోనా వైరస్ అయితే చంద్రబాబు బూస్టర్ డోస్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
విజయవాడ: జగన్ కరోనా వైరస్ అయితే చంద్రబాబు బూస్టర్ డోస్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) అన్నారు. గురువారం బుద్దా వెంకన్న కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ... చంద్రబాబు ఓ రాష్ట్ర నాయకుడు కాదని, జాతీయ నాయకుడన్నారు. విజయ్ సాయి రెడ్డి ఉత్తరాంధ్రలో 50వేల కోట్లు దోచేశారని.. ఆ వాటాల దగ్గరే సీఎంకు, విజయసాయి రెడ్డికి తేడాలు వచ్చాయని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ 5 లక్షల కోట్లు దోచేయడానికి దుకాణం విశాఖకు మారుస్తానంటున్నారని విమర్శించారు. తాను కూడా విశాఖలోనే మకాం పెట్టి తమ అవినీతిని బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే విశాఖలో కబ్జా చేసిన భూములన్ని బాధితులకు అప్పగిస్తామని బుద్దా వెంకన్న హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత కేశినేని చిన్ని (TDP Leader Kesineni Chinni) మాట్లాడుతూ... ఎవరైనా చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. వచ్చే జన్మదినానికి చంద్రబాబుని గెలిపించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు దేశానికి కావల్సిన నాయకుడన్నారు.
టీడీపీ అధికార ప్రతినిధి నాగూల్ మీరా (Nagul Meera) మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమానికి పేటెంట్ చంద్రబాబుదే అని అన్నారు. చంద్రబాబు గెలుపు తెలుగు ప్రజలకు అవసరమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జగన్ అడిగిన ఒకే ఒక్క ఛాన్స్ అయిపోయిందని.. ఈసారి అటు సూర్యుడు ఇటు పొడిచినా జగన్ గెలవడని స్పష్టం చేశారు.