Srisailam Temple: ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల ప్రధాన ఘట్టం ఆరంభం

ABN , First Publish Date - 2023-03-22T08:45:55+05:30 IST

ప్రముఖపుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంభికామల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Srisailam Temple: ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు.. శ్రీశైలంలో  ఉగాది మహోత్సవాల ప్రధాన ఘట్టం ఆరంభం

నంద్యాల: ప్రముఖపుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంభికామల్లికార్జున స్వామి దేవస్థానం (Srisailam Sri Bhramarambhikamallikarjuna Swamy Devasthanam)లో ఉగాది మహోత్సవా (Ugadi Mahotsavam)లు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఉగాది మహోత్సవాల ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఉగాది ఉత్సవాల సందర్భంగా వీరశైవులచే వీరాచార విన్యాసాలు చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా వీరశైవులు శరీర భాగాలపై ఇనుప సువ్వలు గుచ్చుకున్నారు. శరీర భాగాలపై ఇనుప సువ్వలు గుచ్చుకుని వీరశైవులు నృత్యాలు చేశారు. అనంతరం శివదీక్ష శిబిరంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో వీరశైవులు, భక్తులు నడిచారు.

పెరిగిన భక్తుల రద్దీ...

మరోవైపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 9.00 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సంప్రదాయబద్దంగా పంచాంగశ్రవణం జరుగనుంది. సాయంత్రం 5గంటలకు శ్రీశైలం పురవీధులలో స్వామిఅమ్మవార్లకు రథోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 8:00 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ జరుగనుంది.

మూడో రోజు వైభవంగా ఉగాది మహోత్సవాలు

ఈనెల 19న ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు ఐదురోజుల పాటు జరుగనున్నాయి. నిన్న మూడవరోజు ఉగాది మహోత్సవాలు వైభవంగా జరిగాయి. మహా సరస్వతి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామి అమ్మవారు నందివాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకున్నారు. క్షేత్ర పురవీధుల్లో కన్నులపండువగా ఆది దంపతుల గ్రామోత్సవం సాగింది. గ్రామోత్సవంలో విహరిస్తున్న శ్రీస్వామి అమ్మవారిని వేలాదిగా కన్నడ భక్తులు దర్శించుకున్నారు.

Updated Date - 2023-03-22T09:36:16+05:30 IST